కొనసాగుతున్న గజ దాడులు
ABN , First Publish Date - 2023-12-13T01:14:57+05:30 IST
వి.కోట మండల అటవీ సరిహద్దు పంటపొలాలపై గజదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా యాలకల్లు పంచాయతీ ఎర్రినాగేపల్లె, తిమ్మరాజుపురం గ్రామాల వద్ద 13 ఏనుగుల గుంపు అరటి తోటలను తిని, తొక్కి నాశనం చేశాయి.
వి.కోట మండలంలో అరటి, బీన్స్ తోటలు ధ్వంసం
వి.కోట, డిసెంబరు 12: వి.కోట మండల అటవీ సరిహద్దు పంటపొలాలపై గజదాడులు కొనసాగుతున్నాయి. తాజాగా యాలకల్లు పంచాయతీ ఎర్రినాగేపల్లె, తిమ్మరాజుపురం గ్రామాల వద్ద 13 ఏనుగుల గుంపు అరటి తోటలను తిని, తొక్కి నాశనం చేశాయి. సోమవారం రాత్రి సుబ్రమణ్యం అనే రైతుకు చెందిన అరటితోటలోకి జొరబడ్డాయి. తోటను పూర్తిగా విధ్వంసం చేశాయి. ఏనుగుల దాడులను గమనించిన పరిసరాల రైతులు బాధితుడికి తెలపడంతో స్థానికుల సహకారంతో వాటిని దారి మళ్లించారు. ఏనుగుల తొక్కిసలాటలో 1200 మొక్కల్లో సగానికి పైగా పాడయ్యాయి. అందులో అంతర పంటగా వేసిన బీన్స్ తోట కూడా ధ్వంసమైంది. రూ.5 లక్షలకు పైగా పంట నష్టం వాట్టిల్లినట్లు బాధిత రైతు వాపోయారు. మొత్తానికి 13 ఏనుగుల గుంపు మంగళవారం గిడిగి జలపాతం మీదుగా అడవి దారి పట్టాయి. అక్కడ వాటికి కావాల్సిన ఆహారం, తాగునీరు పుష్కలంగా ఉండటం వల్ల ఇక, బయటకు రాకపోవచ్చని అటవీ శాఖ భావిస్తోంది. ఈ ఏనుగులు ఏదో ఓ వైపు నుంచి పంటపొలాల్లోకి వస్తాయోనని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏనుగులను కట్టడి చేయలేరా?
అధికారులతో రైతుల వాగ్వాదం
ఏనుగుల దాడులతో పంట నష్టాన్ని పరిశీలించేందుకు మంగళవారం ఉదయం వచ్చిన అటవీశాఖ అధికారులపై బాధిత రైతులు వాగ్వాదానికి దిగారు. ఏనుగుల వల్ల భారీ ఎత్తున పంటలు నష్టపోతుంటే కనీసం వాటిని కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రివేళలో ఏనుగులు తమ పొలాల్లో ఉన్నాయని ఫోన్ చేస్తుంటే పట్టీపట్టన్లు వ్యవహరించడం ఏంతమేరకు సమంజసమంటూ వాగ్వివాదానికి దిగారు. సిబ్బంది తక్కువగా ఉన్నందున ఏనుగుల దారి మళ్లింపు తమకూ కష్టతరంగా మారిందని డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.