CM Jagan: గుడివాడలో సీఎం జగన్ హెలిపాడ్‌లో దిగుతుండగా...
ABN, First Publish Date - 2023-06-16T10:09:59+05:30
గుడివాడ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఉదయం గుడివాడలో పర్యటన నిమిత్తం అక్కడ ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం దిగుతుండగా మహిళలు నిరసన తెలియజేశారు. గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లను మహిళలు వదిలారు.
అమరావతి: గుడివాడ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి (AP CM YS Jaganmohan Reddy)నిరసన సెగ తగిలింది. గుడివాడలో టిడ్కో ఇళ్ల పరిశీలనకు వస్తున్న సందర్భంగా లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం గుడివాడలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో సీఎం దిగుతుండగా మహిళలు నిరసన తెలియజేశారు. గో బ్యాక్ సైకో సీఎం అంటూ నల్ల బెలూన్లను మహిళలు వదిలారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళలను అడ్డుకున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. అయితే పోలీసుల వలయాన్ని చేధించుకుని మరీ మహిళలు టిడ్కో ప్రాంగణంలోని హెలిపాడ్ వద్ద నిరసనకు దిగారు. తొలగించిన 1600 మంది టిడ్కో లబ్ధిదారులకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మౌలిక వసతులు లేకుండా సీఎం ప్రారంభించిన ఇళ్లలో ఎలా నివాసం ఉంటారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
కాగా.. టిడ్కో ఇళ్లకు సంబంధించి 1600 మంది లబ్ధిదారులను తొలగించడం, టిడ్కో ఇళ్లు టీడీపీ హాయంలో నిర్మిస్తే.. ఇప్పుడు జగన్ వచ్చి ప్రారంభించడం ఏంటని టీడీపీతో పాటు వివిధ ప్రజాసంఘాలు, వామపక్షాల నేతలు కలిసి ఛలో గుడివాడకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హెలీపాడ్‌కు వంద మీటర్ల దూరంలో మహిళలు నల్ల బెలూన్లను ఎగురవేశారు. సరిగ్గా సీఎం జగన్ గుడివాడలో హెలిపాడ్ దిగుతున్న సమయంలో మహిళలు నల్లబెలూన్లను ఎగురవేశారు. 1600 మంది లబ్ధిదారులను ఎందుకు తొలగించారని, వారి పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు టిడ్కో ఇళ్లను ప్రారంభించడం ఏంటని నిలదీశారు. సీఎం గుడివాడ పర్యటన నేపథ్యంలో నిరసకు ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు ఉదయం నుంచి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. అయితే కొందమంది మహిళలు పోలీసుల కన్నుగప్పి హెలిపాడ్ వద్దకు చేరుకుని సీఎం హెలికాఫ్టర్ దిగుతున్న సమయంలో నల్లబెలూన్లు ఎగురవేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నల్లబెలూన్లు ఎగురవేయడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.
ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయలుదేరిన సీఎం జగన్ కాసేపటి క్రితమే గుడివాడకు చేరుకున్నారు. గుడివాడ మునిసిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Updated Date - 2023-06-16T10:31:32+05:30 IST