Ramakrishna Letter: అనంతలో సీఎస్ఐ స్థాలన్ని కాపాడండి... జగన్‌కు రామకృష్ణ లేఖ
ABN , First Publish Date - 2023-05-19T10:25:11+05:30 IST
అనంతపురం నగరం నడిబొడ్డున దాదాపు రూ.200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ (సీఎస్ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి అని సీపీఐ కార్యదర్శి కే.రామకృష్ణ డిమాండ్ చేశారు.
అమరావతి: అనంతపురం నగరం నడిబొడ్డున దాదాపు రూ.200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ (సీఎస్ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి అని సీపీఐ కార్యదర్శి కే.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డికి రామకృష్ణ లేఖ రాశారు. 7 ఎకరాల 67 సెంట్లు సీఎస్ఐ చర్చి స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసేందుకు 2007 నుండి బీఎన్ఆర్ సోదరులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆయా భూములలో నివాసం ఉంటున్న పేదలను, విద్యాసంస్థలను ఖాళీ చేయించేందుకు పలుమార్లు దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో బీఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్ ఆగడాలకు అడ్డుకట్ట వేశారన్నారు. బీఎన్ఆర్ సోదరులు సృష్టించిన దొంగ పత్రాలను రద్దు చేయాలని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు కోర్టులో కేసు వేయడం గమనార్హమని చెప్పారు. కోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఆయా భూములలో ఎలాంటి చట్ట విరుద్ధమైన అక్రమ కట్టడాలు జరగకుండా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు, విద్యాసంస్థలకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు అధికారులను ఆదేశించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.