కుండపోత వాన!

ABN , First Publish Date - 2023-05-21T01:38:56+05:30 IST

జిల్లాలో పలుచోట్ల శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది.

కుండపోత వాన!
కాకినాడ నగరంలో వాన చిత్రాలు..

జిల్లావ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం

కాకినాడ నగరంలో నిలిచిన విద్యుత్‌ సరఫరా

మళ్లీ తడిచిన ధాన్యం

పోర్టుసిటీ (కాకినాడ), మే 20 : జిల్లాలో పలుచోట్ల శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో మొదలై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పిడుగుపాటు శబ్దాలకు ప్రజలు భయాందోళన చెందారు. కాకినాడ నగరంతోపాటు పలు మండలాల్లో వీచిన గాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ముంపునీరు నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం అంతా వేసవితాపంతో మగ్గిపోయిన జనానికి సాయంత్రం కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం చెందారు. అయితే ప్రస్తుతం జిల్లాలో వరి మాసూళ్లు జోరుగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి ఎండలు మండిపోతుండడంతో గొల్లప్రోలు, పిఠాపురం, కాకినాడ రూరల్‌, తుని తదితర ప్రాంతాల రైతులు వర్షం భయం లేకుండా మిషన్ల ద్వారా కోసిన వరి ధాన్యాన్ని ఎక్కడివి అక్కడే రాశులు వేసి బరకాలు కప్పకుండా వదిలేశారు. ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులంతా హుటాహటీన ధాన్యపు రాశులను సంరక్షించుకునేందుకు నానాపాట్లు పడ్డారు. అయినా కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిచినట్టు సమాచారం. ఇక ఈదురుగాలులకు పలు గ్రామాల్లో చెట్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. కరప మండలం నడకుదురు ప్రధాన రహదారిపై ఆరు చెట్లు విరిగి పడడంతో ఇరువైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గొల్లప్రోలు మండలంలో గాలులకు మామిడికి నష్టం వాటిల్లింది.

Updated Date - 2023-05-21T01:38:56+05:30 IST