AP News: రాజశ్యామల యాగానికి జగన్ అనర్హుడు: బొండా ఉమా
ABN , First Publish Date - 2023-05-04T21:11:35+05:30 IST
హిందూ ధర్మంపై నమ్మకం లేని సీఎం జగన్ (CM Jagan) రాజశ్యామల యాగం ఎలా చేస్తారని టీడీపీ నేత బొండా ఉమా (Bonda Uma) ప్రశ్నించారు.
విజయవాడ: హిందూ ధర్మంపై నమ్మకం లేని సీఎం జగన్ (CM Jagan) రాజశ్యామల యాగం ఎలా చేస్తారని టీడీపీ నేత బొండా ఉమా (Bonda Uma) ప్రశ్నించారు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేకపోయినా దేవాలయాల సొమ్ముతో వ్యక్తిగత పూజలు, యాగాలు నిర్వహించుకోవడం ప్రజలను మోసం చేయటమేనని విమర్శించారు. ఈ నెల 12 నుంచి 17వ తేదీ వరకు విజయవాడ (Vijayawada)లో జగన్ రాజశ్యామల యాగం తలపెట్టారని తెలిపారు. జగన్ తన సొంత డబ్బుతో ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా అడిగే వారు ఉండరని, కానీ అందుకు విరుద్ధంగా దేవదాయ శాఖ సొమ్ము రూ. 10 కోట్లతో పూజలు, యాగాలు తలపెట్టి హిందు దేవాలయాల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
ఏనాడైన జగన్ ఆలయాలకు వచ్చి మనస్పూర్తిగా దేవుడికి దణ్ణం పెట్టుకుని తీర్ధ, ప్రసాదాలు స్వీకరించాడా అని ప్రశ్నించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా ముఖ్యమంత్రి సతీసమేతంగా వెళ్లి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, జగన్ ఏ రోజైనా తన భార్యను తీసుకుని ఆలయానికి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించారా అని ప్రశ్నించారు. ఏ ఆలయానికి భార్యను తీసుకుని వెళ్లని జగన్ ఏ మోహం పెట్టుకుని రాజశ్యామల యాగం చేస్తారని దుయ్యబట్టారు. రాజశ్యామల యాగం పేరుతో ఏ ఏ ఆలయాల నుంచి ఎంతెంత నిధులు తెచ్చారో తిరిగి ఆ నిధులను వెనక్కి ఇచ్చేయాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.