Avinash Reddy : అవినాష్ కార్ చేజింగ్.. ఆపేదే లేదు.. ఇక విచారణ కాదు.. నేరుగా అరెస్టే అంటున్న సీబీఐ..!
ABN , First Publish Date - 2023-05-19T14:04:39+05:30 IST
ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఇక మీదట సీబీఐ ఉపేక్షించేలా లేదు. ఇక మీదట విచారణ అంటూ ఏమీ లేదు నేరుగా అరెస్టే అని సీబీఐ అధికారులు అంటున్నారు. అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరై పులివెందులకు వెళుతున్నా రన్న సమాచారాన్ని సీబీఐ అధికారులు హెడ్ క్వార్టర్స్‌కు అందించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలంటూ అధికారులకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు అందాయి.
ఢిల్లీ : ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో ఇక మీదట సీబీఐ ఉపేక్షించేలా లేదు. ఇక మీదట విచారణ అంటూ ఏమీ లేదు నేరుగా అరెస్టే అని సీబీఐ అధికారులు అంటున్నారు. అవినాష్ రెడ్డి విచారణకు గైర్హాజరై పులివెందులకు వెళుతున్నా రన్న సమాచారాన్ని సీబీఐ అధికారులు హెడ్ క్వార్టర్స్‌కు అందించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలంటూ అధికారులకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశాలు అందాయి. ఈ క్రమంలోనే పులివెందులకు వెళుతున్న అవినాష్‌ను సీబీఐ అధికారులు వెంబడిస్తున్నారు. కనీసం ఫోన్ చేసినా కూడా ఆయన కారు ఆపడం లేదని తెలుస్తోంది. తను ఆగే ప్రసక్తే లేదని.. తన తల్లిని చూడాలని సీబీఐ అధికారులకు చెబుతున్నట్టుగా తెలుస్తోంది. పులివెందులకు వెళ్లైనా అవినాష్‌ను అరెస్ట్ చేయాలని సీబీఐ అధికారులు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
సీబీఐ విచారణ మాటేమో కానీ.. ఆ విచారణకు హాజరు కావాల్సిన రోజు మాత్రం ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత విచారణ నేపథ్యంలో వ్యవహరించిన మాదిరిగానే నేడు కూడా అవినాష్ రెడ్డి వ్యవహరించారు. గత విచారణ నేపథ్యంలో కూడా ఒక రోజు ముందుగానే అవినాష్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక విచారణకు హాజరు కావాల్సిన రోజు తన కారులో సీబీఐ కార్యాలయానికి అన్నట్టుగా బయలుదేరి నేరుగా పులివెందులకు వెళ్లిపోయారు. ఈ రోజు కూడా అలాగే చేశారు. సీబీఐ కార్యాలయానికి అన్నట్టుగా బయలుదేరి పులివెందుల బాట పట్టారు. అదేమంటే తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెబుతున్నారు. మరి సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారా? వెనక్కి తగ్గుతారా? అనేది మరికాసేపట్లో తెలియనుంది.