బాలభాస్కరరావు పోరాటాలు స్ఫూర్తిదాయకం
ABN , First Publish Date - 2023-05-19T01:17:06+05:30 IST
చల్లపల్లి భూపోరాటాల్లో ప్రముఖ పాత్రపోషించిన మాలెంపాటి బాల భాస్కరరావు పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు.
చల్లపల్లి, మే 18 : చల్లపల్లి భూపోరాటాల్లో ప్రముఖ పాత్రపోషించిన మాలెంపాటి బాల భాస్కరరావు పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో అవసరమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. భూపోరాటయోధుడు మా లెంపాటి బాలభాస్కరరావు శతజయంతి ఉత్సవాన్ని చల్లపల్లి చండ్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, రైతాంగాన్ని నిర్వీర్యం చేసేలా ముందుకుసాగుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాల్సి ఉందన్నారు. దేశంలో పేదరికం పోయేంతవరకూ కమ్యూనిస్టు ఉద్యమం కొనసాగుతూ ఉంటుందని స్పష్టం చేశారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు అధ్యక్షతన జరిగిన సభలో ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ చలసాని రాఘవేంద్రరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి టి.తాతయ్య, మహిళా సమాఖ్య సీనియర్ నేత దేవభక్తుని నిర్మల, బ్యాంకు డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గుత్తికొండ రామారావు ప్రసంగించారు. ఆర్.పిచ్చియ్య, మల్లుపెద్ది రత్నకుమారి, అట్లూరి వెంకటేశ్వరరావు, పాలడుగు రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత నిమ్మగడ్డ నుంచి ప్రభలతో ఊరేగింపుగా తరలివచ్చారు. బాలభాస్కరరావు జీవిత చరిత్ర పుస్తకాన్ని జె.వి.సత్యనారాయణమూర్తి ఆవిష్కరించారు. బాలభాస్కరరావు స్థూపం, చిత్రపటాల వద్ద నివాళులు అర్పించారు.