దంచిన వాన
ABN, First Publish Date - 2023-09-12T01:18:16+05:30
అల్పపీడన ప్రభావం కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో వర్షం ముంచెత్తింది. అదునైన సమయంలో వర్షాలు పడటంతో గ్రామీణ ప్రాంతాలు హర్షంలో ఉండగా... భారీ వర్షంతో విజయవాడ నగరంలోని ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 769.6 మిల్లీమీటర్ల మేర వర్షం పడగా.. జిల్లా సగటు వర్షపాతం 38.48గా నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో రైతులకు ఊరట కలిగింది. మాగాణికి ఉపకరించింది.
అర్ధరాత్రి నుంచి కుండపోత...
ఉమ్మడి కృష్ణాలో రైతాంగానికి ఊరట
పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు అతలాకుతలం
బెజవాడ ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు
విజయవాడ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావం కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో వర్షం ముంచెత్తింది. అదునైన సమయంలో వర్షాలు పడటంతో గ్రామీణ ప్రాంతాలు హర్షంలో ఉండగా... భారీ వర్షంతో విజయవాడ నగరంలోని ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 769.6 మిల్లీమీటర్ల మేర వర్షం పడగా.. జిల్లా సగటు వర్షపాతం 38.48గా నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. కృష్ణా జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో రైతులకు ఊరట కలిగింది. మాగాణికి ఉపకరించింది.
విజయవాడ నగరం, పరిసర ప్రాంతాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 89.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆ తర్వాత విజయవాడ రూరల్ మండలంలో 66.4, విజయవాడ తూర్పు లో 86.2, విజయవాడ సెంట్రకల్‌లో 85.4, విజయవాడ ఉత్తరంలో 85.4, విజయవాడ పశ్చిమలో 85.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయింది. నగరాన్ని వర్షం ముంచెత్తటంతో.. పశ్చిమ, తూర్పు నియోజకవర్గాలు మునకేశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షంతో నగరంలో సగ భాగం నీట మునిగింది. పశ్చిమ నియోజకవర్గంలో పదిహేనేళ్ల కిందట నాటి పరిస్థితి మళ్లీ గుర్తుకు వచ్చింది. పాతబస్తీలో గట్టు వెనుక ప్రాంతాలు మోకాళ్ల లోతున మునిగిపోయాయి. ఊర్మిళానగర్, రోటరీనగర్, కబేళ సెంటర్, కామకోటి నగర్, విద్యాధరపురం, వించిపేట వంటి ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. పదిహేనేళ్ల కిందట పశ్చిమలో మురుగు ముంచెత్తటంతో వారం రోజులు పాటు ప్రజలు మురుగులోనే సహజీవనం చేయాల్సి వచ్చింది. మళ్లీ అలాంటి పరిస్థితి దాపురించిందేమోనని పాతబస్తీ వాసులు ఆందోళన చెందారు. ఏ రోడ్డు చూసినా మోకాళ్ల లోత నీటితో నిండిపోయింది. వర్షపు నీరు, డ్రెయిన్లలోని మురుగు నీరు కలిసిపోయి రోడ్లమీద నిల్వ ఉండిపోయాయి. దీంతో పాతబస్తీ ప్రజలు భయాందోళనలు చెందారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో మొగల్రాజపురం సెంటర్ పూర్తిగా జలదిగ్బంధమైంది. మొగల్రాజపురంలోని నిలిచిన నీరు కాకుండా వర్షంతో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరంతా పొంగటంతో.. ఇక్కడ నుంచి ఆ నీరు పారుకుంటూ లయోల కాలేజీ మీదుగా గుణదలకు చేరింది. దీంతో గుణదలలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గుణదలలో జరుగుతున్న డ్రెయినేజీ పనుల కారణంగా నీరు కొన్నిచోట్ల నిలిచిపోయింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్‌నకు ఎన్నాళ్లీ శాపం
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నగరంలోని విద్యాధరపురం వర్క్‌షాప్ నీట మునుగుతూ ఉంటుంది. ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొన్నా ఆర్టీసీ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డు అంతాలో లెవలింగ్ ఏరియాలో ఉంది. ఆర్టీసీ జోనల్ వర్క్‌షాప్ అయితే మరీ లోతట్టున ఉంటుంది. దీంతో వర్క్‌షాప్ పూర్తిగా నీట మునిగింది. బస్సుల విడిభాగాలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఆర్టీసీ సిబ్బంది నడవటానికే చాలా ఇబ్బంది పడిపోయారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Updated Date - 2023-09-12T01:18:16+05:30 IST