FAPTO Chairman: జగన్ ఉద్యోగులను మోసం చేశారు..
ABN, First Publish Date - 2023-06-21T16:18:39+05:30
విజయవాడ: సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని, జీపీయస్ పేరుతో ఉద్యోగులు పది శాతం చెల్లించాలని చెప్పడం ఏంటని ఫ్యాప్టో ఛైర్మన్ ఎన్ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.
విజయవాడ: సీపీఎస్ (CPS) రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) ఉద్యోగులను మోసం చేశారని, జీపీయస్ (GPS) పేరుతో ఉద్యోగులు పది శాతం చెల్లించాలని చెప్పడం ఏంటని ఫ్యాప్టో ఛైర్మన్ (FAPTO Chairman) ఎన్ వెంకటేశ్వర్లు (N.Venkateswarlu) ప్రశ్నించారు. బుధవారం ఆయన విజయవాడ (Vijayawada)లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే హామీలను నమ్మే పరిస్థితిలో లేమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను కలుపుకుని ఐక్య కార్యాచరణకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. 11వ పీఆర్సీ విషయంలో మోసం చేశారని, 12వ పీఆర్సీ విషయంలో విధివిధానాలు చెప్పకుండా మళ్లీ మాయ చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
జులై 2023 నుంచి ఫిట్ మెంట్‌తో కూడిన పీఆర్సీ ఇవ్వాలని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించాలని, సీపీయస్, జీపీయస్ రద్దు చేసి పాత పెన్షన్ మాత్రమే అమలు చేయాలని ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో కలిసి వచ్చే వారితో ఉద్యమం చేస్తామన్నారు. విద్యారంగంలో నూతన విధానాలతో పని ఒత్తిడి పెంచుతున్నారని, మూడు ఆదివారాలు వరుసగా జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని.. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
ఫ్యాప్టో ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి మంజుల (Chennupati Manjula) మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దును అమలు చేయకుండా జీపీయస్‌ను రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని, ఈ విధానం మేలు చేస్తుందని మభ్య పెట్టేలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జీవో 117 పేరుతో పాఠశాలలను విలీనం చేసి పిల్లలు లేకుండా చేశారని, ఈ చర్యల వల్ల పిల్లల నమోదు సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందన్నారు. 99 లోపు విద్యార్థులు ఉంటే టీచర్‌ను ఇవ్వబోమని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని.. దీని వల్ల టీచర్లను మరో చోటుకు బదిలీ చేస్తున్నారన్నారు. ఎంఈవో ప్రమోషన్ల పేరుతో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని, ఐదేళ్ల కాల పరిమితి పేరుతో కేవలం పది వేల మందిని మాత్రమే రెగ్యులర్ చేశారన్నారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఒకే విడతలో ఇవ్వాలని, విడతల వారీగా అంటే తాము అసలు ఉంటామో లేదోనని అన్నారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం అమలు కోసం అందరూ ఐక్యంగా పోరాటంలోకి రావాలని చెన్నుపాటి మంజుల పిలుపిచ్చారు.
Updated Date - 2023-06-21T16:18:39+05:30 IST