Share News

Kodali Nani: అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా... టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్

ABN , First Publish Date - 2023-11-20T13:47:30+05:30 IST

గుడివాడ గురించి టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kodali Nani: అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా... టీడీపీకి కొడాలి నాని ఛాలెంజ్

కృష్ణా: గుడివాడ గురించి టీడీపీ చీఫ్ చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu), ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని (MLA Kodali Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గుడివాడలో ముస్లిం సంచారజాతుల బిసి(ఈ) కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని ముస్లిం సోదరులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గుడివాడ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు, నివాస స్థలాల కోసం టీడీపీ (TDP) హయంలో ఒక్క ఎకరా సేకరించినట్లు నిరూపిస్తే... ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ నాని ఛాలెంజ్ చేశారు. సీఎంలుగా వైఎస్ఆర్, జగన్ గుడివాడ ప్రజల అవసరాల కోసం 625 ఎకరాల భూములు కొన్నారన్నారు.


గుడివాడలో తన బంధువులు ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలను ఆత్మబంధువులుగా చూసే జగన్ గుడివాడ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి 4వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రామాయణంలో పిడకల వేటలా పనికిమాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు. ధనికుల కార్లు బ్రేకులు వెయ్యకుండా రోడ్లపై తిరగాలనే ప్రతిపక్షాల ఆరాటమని అన్నారు. ప్రతి పేద వాడిని ఆత్మబంధువుగా చూసే జగన్ వాళ్ల అవసరాలు తీర్చేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు మాదిరి ఒక్క విడత ఏదైనా పథకం ఆపితే రోడ్ల సమస్యను పరిష్కరించవచ్చని సీఎం జగన్‌కు తాము చెప్పామన్నారు. ప్రాణం పోయినా ప్రజలకు ఇచ్చిన మాటను తప్పనని సీఎం జగన్ చెప్పారని.. త్వరలో రాష్ట్రంలోని రోడ్ల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఇళ్ల వద్దే 99% కుటుంబాల సమస్యలు పరిష్కారంమవుతున్నాయని కొడాలి నాని వెల్లడించారు.

Updated Date - 2023-11-20T13:47:32+05:30 IST