Kodali Nani: ప్రభుత్వ తప్పులను పవన్ ఎత్తి చూపితే అభ్యంతరం లేదు.. కానీ..!
ABN, First Publish Date - 2023-08-07T15:56:02+05:30
రాజకీయంగా తమను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్‌కు సమాధానమిస్తాం. ఎన్నికలు అయ్యేవరకు పవన్‌కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల అంతిమ లక్ష్యం చంద్రబాబును కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలని కోరుకుంటున్నారు.
కృష్ణా జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan kalyan)పై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని (Kodali Nani) విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాజకీయంగా తమను ఎదుర్కొంటే పవన్ కళ్యాణ్‌కు సమాధానమిస్తాం. ఎన్నికలు అయ్యేవరకు పవన్‌కళ్యాణ్ ఎన్ని యాత్రలు చేసినా తమకు అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ మద్దతుదారుల అంతిమ లక్ష్యం చంద్రబాబును కనీసం ప్రతిపక్ష నేతగానైనా చూడాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు రక్తంలోని ప్రతి అణువులో వెన్నుపోటు ఉంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్‌కు స్వయంగా చెప్పేందుకు అనేక సార్లు ప్రయత్నించాను. కుదరకపోవడంతో మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబును గ‌్రుడ్డిగా నమ్మితే పవన్‌కళ్యాణ్ కూడా అధోగతి పాలవుతారు. రాజకీయాల్లో వైసీపీకి ఎదురు నిలిచి.. ప్రభుత్వ తప్పులను పవన్ కళ్యాణ్ ఎత్తి చూపితే తమకు అభ్యంతరం లేదు. బినామీలతో కలిసి తమపై దాడి చేస్తే సహించేది లేదు. అదే స్థాయిలో ప్రతి విమర్శ చేస్తాం. రాజకీయాలను మారుస్తానంటున్న పవన్ కళ్యాణ్.. ఏ రకంగా చంద్రబాబు మద్దతుదారులతో కలిసి నడుస్తారు.’’ అని కొడాలి నాని ప్రశ్నించారు.
‘‘మంత్రి పెద్దిరెడ్డి పేరు చెబితేనే చంద్రబాబు ఉలిక్కి పడే పరిస్థితి. కుప్పం మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును తరిమికొట్టే వరకు పెద్దిరెడ్డి నిద్రపోరు. పక్క రాష్ట్రాల్లోని జనాలను పోగేసి కొచ్చి పుంగనూరులో చంద్రబాబు సాధించింది ఏముంది. చంద్రబాబుకు మంగళం పాడి, రాజకీయాల నుంచి చరమగీతం పాడేది పెద్దిరెడ్డి మాత్రమే. 40 ఏళ్ల ఇండస్ట్రీ చంద్రబాబు తన హయాంలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు ప్రకటించాలి. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో రాష్ట్రంలో చంద్రబాబు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ 70 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. కనీసం ఆయన జిల్లాకు చెందిన గాలేరు నగరి కాలువను తవ్వలేని చంద్రబాబు.. ప్రాజెక్టుల పేరుతో పర్యటనలు చేయడం హాస్యాస్పదం. ఎన్టీఆర్ (NTR) శంకుస్థాపన చేసిన తెలుగు గంగానే పూర్తి చేయలేని మొనగాడు చంద్రబాబు. 20 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ.. పోలవరానికి వంద కోట్ల పనులు కూడా ఎందుకు చేయలేదు.’’ అని కొడాలి నాని నిలదీశారు.
వైఎస్సే కారణం..
‘‘పోలవరానికి (Polavaram project) జాతీయ హోదా రావడానికి కారణం వైఎస్సార్. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని తన పబ్లిసిటీ కోసం చంద్రబాబు చేపట్టారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుతున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే (PM MODI) చెప్పారు. మెయిన్ ప్రాజెక్ట్ అవ్వకుండా కాపర్ డ్యాం కట్టడం వల్లనే పొలవరానికి సమస్యలు. 40 ఏళ్లుగా చేయలేని వాడు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏం చేస్తారు? ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి, అమరావతికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు.’’ అని కొడాలి నాని పేర్కొన్నారు.
Updated Date - 2023-08-07T15:56:02+05:30 IST