AP News: నెల్లూరు కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం.. కావాలని చేశారా?.. ఎన్నో అనుమానాలు..
ABN , First Publish Date - 2023-02-11T15:14:38+05:30 IST
జిల్లాలోని కలెక్టరేట్‌లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.
నెల్లూరు: జిల్లాలోని కలెక్టరేట్ (Nellore Collectorate)లో శనివారం అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. కలెక్టరేట్ స్టోర్ రూమ్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు అలముకున్నాయి. ఈ ప్రమాదంలో స్టోర్ రూమ్‌లో ఉన్న ఫర్నీచర్, ఎన్నికల సామాగ్రి (Election materials) అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపు చేశారు.
కలెక్టరేట్‌లో వెనక వైపు ఉన్న స్టోర్‌రూమ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్టోర్‌రూమ్‌లో ఎన్నో కీలకమైన ఫైళ్లు, ఎన్నికల సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా.. ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ (MLC Election Notification) విడుదలైంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల వివరాలు స్టోర్ రూంలో ఉన్నాయా అనే చర్చలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇక్కడ ఉన్న పౌరసరఫరాలశాఖలో అనుకోకుండా భారీ అగ్నిప్రమాదం జరిగింది. విచారణ అనంతరం పెద్ద ఎత్తున కుంభకోణం బయటపడింది. ఈ క్రమంలో స్టోర్ రూమ్‌లో ఉన్న ఫైళ్లను తగులబెట్టేందుకు ఎవరైనా కావాలనే అగ్నిప్రమాదాన్ని సృష్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంతో నెల్లూరు కలెక్టరేట్‌లో గందరగోళం నెలకొంది. అగ్నిప్రమాదంలో తగులబడిన వాటి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కలెక్టరేట్ కాంపౌండ్‌లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదంతో వారంత తీవ్ర భయాందోళనకు గురయ్యారు.