wedding bus Accident: బతుకులు బోల్తా..!
ABN, First Publish Date - 2023-07-12T02:32:27+05:30
పెళ్లింట ఘోర విషాదం చోటుచేసుకుంది. వరుడి ఇంట రిసెప్షన్‌లో పాల్గొనేందుకు బయల్దేరిన పెళ్లి బస్సు అరగంటలోనే ఘోర ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ట్రావెట్ బస్సును తప్పించబోయి.. రోడ్డుపక్కన పైప్‌లైన్ దిమ్మెను ఢీకొని అదుపుతప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది.
సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు
ఏడుగురు దుర్మరణం.. 18 మందికి గాయాలు
నలుగురి పరిస్థితి విషమం.. రిమ్స్‌కు తరలింపు
ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఘోర ప్రమాదం
దర్శి/పొదిలి, రాజాం రూరల్, జూలై 11: పెళ్లింట ఘోర విషాదం చోటుచేసుకుంది. వరుడి ఇంట రిసెప్షన్‌లో పాల్గొనేందుకు బయల్దేరిన పెళ్లి బస్సు అరగంటలోనే ఘోర ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న ట్రావెట్ బస్సును తప్పించబోయి.. రోడ్డుపక్కన పైప్‌లైన్ దిమ్మెను ఢీకొని అదుపుతప్పి సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘోరం జరిగింది. పొదిలికిచెందిన షేక్ సిరాజ్ కుమార్తె జాతియమహర్ వివాహం కాకినాడకు చెందిన వరుడితో ఆదివారం పొదిలిలో జరిగింది. అనంతరం బంధువులంతా కాకినాడలోని పెళ్లి కుమారుడి ఇంటి వద్ద రిసెప్షన్ వేడుకలో పాల్గొనేందుకు ఒంగోలు డిపోకు చెందిన ఇంద్రా బస్సులో బయలుదేరారు. బస్సులో 37 మంది పెళ్లి బృందం, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. పొదిలి నుంచి డ్రైవింగ్ చేస్తున్న ఎ.రమేశ్ కుమార్‌కు ఆ రూట్ కొత్త. దర్శి సమీపంలోని సాగర్ కాలువ వద్ద ఎదురుగావస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు సైడ్ ఇచ్చే క్రమంలో రోడ్డు మార్జిన్‌లో చెట్లతో కమ్ముకొనిపోయి ఉన్న పైపులైన్ రక్షణ కోసం నిర్మించిన కాంక్రీట్ దిమ్మెను ఎక్కించాడు. దీంతో బస్సు కంట్రోల్ తప్పి, సాగర్ కాలువలోకి పడిపోయింది. సుమారు 25 అడుగుల లోతుకు బస్సు నిలువుగా పడటంతో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. పొదిలికి చెందిన ముస్లిం మతపెద్ద అబ్దుల్ హజీజ్ (65), భార్య అబ్దుల్ హనీ (60), మనుమరాలు షేక్ హీనా (6), మరో నలుగురు ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ సబీన (35), చెన్నైకి చెందిన షేక్ రమీజ్ (48) అక్కడిక్కడే మృతిచెందారు. షేక్ రమీజ్ చెన్నైలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్ రియాజుద్దీన్ సతీమణి. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వీరిలో ముల్లా మునీర్‌బాషా, షేక్ యజ్దాన్, షేక్ షాహీద్, ముల్లా షబ్బీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మిగిలిన క్షతగాత్రులు దర్శి కమ్యునిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం నేపథ్యంలో వరుడి ఇంట మంగళవారం జరగాల్సిన రిసెప్షన్ ఆగిపోయింది. మృతులకు రూ.10లక్షలు చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. మృతులకు ఆర్టీసీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ప్రకటించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆర్‌అండ్‌బీ అధికారులు హడావుడిగా చెట్లు తొలగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ముందే చేస్తే ప్రాణాలు పోయేవి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-07-12T02:58:31+05:30 IST