Kollu Ravindra: జగన్ నీ పతనాన్ని ఎవరూ ఆపలేరు.. తరిమితరిమి కొడతాం

ABN , First Publish Date - 2023-08-09T15:25:28+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద హత్యాయత్నం కేసు బనాయించడంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు.

Kollu Ravindra: జగన్ నీ పతనాన్ని ఎవరూ ఆపలేరు.. తరిమితరిమి కొడతాం

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) మీద హత్యాయత్నం కేసు బనాయించడంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Former Minister Kollu Ravindra) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమే చంద్రబాబు మీద హత్యాయత్నం కేసు అని మండిపడ్డారు. కేసులు పెట్టి ఆపాలని చూస్తున్నారు. అంతకు రెట్టింపుతో వైసీపీ అవినీతి అక్రమాలు బయట పెడతామన్నారు. అవసరమైతే జైల్ భరో కార్యక్రమంతో జైళ్లలో తమ నిరసన తెలియజేస్తామని చెప్పారు. అవసరమైతే క్విట్ ఇండియా లాగా ఈ రాష్ట్రం నుంచి క్విట్ జగన్ కార్యక్రమం చెబుతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటిస్తూ ప్రాజెక్టులపై ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అక్రమాలను ప్రజలకు వివరిస్తూ, ప్రశ్నిస్తూ ముందుకెళుతుంటే ఈ వైసీపీ నాయకులకు మింగుడు పడలేదని ఆయన మండిపడ్డారు.


ప్రాజెక్టుల గురించి నిజనిజాలు ప్రజలకు వివరిస్తున్నాడని అంగళ్లులో టీడీపీ అధినేతపైనే హత్యాయత్నం చేశారని.. తిరిగి ఆయనపై హత్యాయత్నం కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసింది వైసీపీ గుండాలని.. పక్కనుంచి చేయించింది పోలీసులు.. కానీ కేసులు మాత్రం చంద్రబాబు మీద అంటూ విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉందో ఈ ఒక్క సంఘటన నిరూపిస్తుందన్నారు. ‘‘జగన్ మోహన్ రెడ్డి ఇంకా నీ పతనాన్ని ఎవరు ఆపలేరు. ఈ రాష్ట్రం నుంచి తరిమితరిమి కొడతాం’’ అంటూ కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Updated Date - 2023-08-09T15:25:28+05:30 IST