ఈవోలతో బదిలీలాట!
ABN , First Publish Date - 2023-11-18T03:23:18+05:30 IST
రాష్ట్రంలో ప్రధాన ఆలయాల ఈవోలతో ప్రభుత్వం ఆటాడుకుంటోంది. ఈవోల బదిలీల విషయంలో నిమిషానికో నిర్ణయం తీసుకుంటోంది.
దేవదాయ శాఖలో ఇష్టారాజ్యం
పూటకో ఆర్డర్‌తో గందరగోళం
రాజకీయ పైరవీలకు పెద్దపీట
మంత్రి వర్సెస్ స్థానిక ఎమ్మెల్యేలు
బదిలీ అయిన ఒక్కరోజులోనే
శ్రీకాళహస్తి ఈవో ఆర్డర్ మార్పు
ఎమ్మెల్యే వ్యతిరేకించడమే కారణం
దుర్గగుడి ఈవో నియామకంలోనూ
ఇలాగే రాజకీయ పైరవీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో ప్రధాన ఆలయాల ఈవోలతో ప్రభుత్వం ఆటాడుకుంటోంది. ఈవోల బదిలీల విషయంలో నిమిషానికో నిర్ణయం తీసుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. వీరు తాము అనుకున్నదే జరగాలన్న పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. దీంతో ఈవోల నియామకం విషయంలో పైరవీలు, రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న దుర్గమ్మ గుడి ఈవో విషయంలో స్థానిక ఎమ్మెల్యే, దేవదాయ శాఖ మంత్రి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. మంత్రి ప్రస్తుత ఈవోనే కొనసాగించాలని పట్టుబట్టగా.. ఈవోను మార్చి తనకు కావాల్సిన వారిని నియమించుకునేందుకు ఎమ్మెల్యే విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి ఎమ్మెల్యే చెప్పిన వారికే పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి కూడా సీఎంవోపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఇద్దరూ చెప్పిన వారిని తొలగించి కొత్త అధికారిని ఈవోగా నియమించారు. తాజాగా అన్నవరం ఈవో విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఏసీబీ కేసుల్లో ఉన్న చంద్రశేఖర్ ఆజాద్‌ను దేవదాయ శాఖ మంత్రి పట్టుబట్టి మరీ అన్నవరం ఈవోగా బదిలీ చేశారు. అన్నవరం ఈవోగా ఉన్న సత్యనారాయణమూర్తి తల్లి కాలం చేయడంతో ఆయన ఆలయంలోకి వెళ్లకూడదన్న ఉద్దేశంతో చంద్రశేఖర్ ఆజాద్‌ను ఇన్‌చార్జి ఈవోగా నియమించారు. దేవదాయ శాఖ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆర్డర్ ఇచ్చారు. ఆయన అన్నవరం ఈవోగా వచ్చిన తర్వాత అనేక వివాదాలు జరిగాయి. అర్చకుల విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో పాటు ఆ జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఆయన పట్ల గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ సీఎంవోలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఆయన్ను శ్రీకాళహస్తి దేవస్థానం ఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడిన రోజే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి వేరే దారి లేక చివరికి ఆయన్ను దేవదాయ శాఖ కమిషనరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దుర్గమ్మ గుడి ఈవో కేఎస్ రామారావును శ్రీకాళహస్తి ఇన్‌చార్జి ఈవోగా నియమించింది. అన్నవరం దేవస్థానం ఈవోగా కె.రామచంద్రమోహన్‌ను నియమించింది. ఇలా ప్రధాన ఆలయాల ఈవోల నియామకం విషయంలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది.
మితిమీరిన మంత్రి జోక్యం
మేజర్ ఆలయాల్లో ఈవోల నియామకాల విషయంలో మంత్రి జోక్యం మరీ ఎక్కువగా ఉంటోందన్న చర్చ సాగుతోంది. కొంతమంది అధికారుల బదిలీల విషయంలో మంత్రి అడ్డగోలుగా సపోర్టు చేస్తున్నారు. ఆ అధికారుల వల్ల ఆలయాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నా, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అలాంటి వారిని మార్చాలని ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపినా వీల్లేదని మంత్రి అడ్డపడుతున్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో బదిలీ అయిన ఒక ప్రధాన ఆలయం ఈవో నుంచి మంత్రికి భారీగా నెలవారీ ముడుపులు వస్తాయని, అందుకే ఆయన బదిలీ విషయంలో మంత్రి అడ్డుపడినట్లు తెలుస్తోంది. ఆ ఈవో అడ్డగోలు నియామకం వెనుక కూడా మంత్రి హస్తం ఉన్నట్లు సమాచారం. సదరు అధికారి బదిలీ విషయంలో మంత్రి అడ్డుపడినా సీఎంవో అధికారులు మాత్రం స్థానిక పరిస్థితుల నేపథ్యంలో బదిలీ చేశారు. ఇలానే మరికొంత మంది అవినీతి అధికారులకు మంత్రి సపోర్టు చేస్తున్నారు. వారు ఏ తప్పులు చేసినా పట్టించుకోకపోవడంతో పాటు ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. దీంతో కొంతమంది ఈవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఆలయాలపై ‘రెవెన్యూ’ దృష్టి
దేవదాయ శాఖలో జాయింట్ కమిషనర్ కేడర్ అధికారులు చాలా తక్కువ మంది ఉన్నారు. 8 మంది ఉండాల్సిన చోట నలుగురు మాత్రమే ఉన్నారు. నలుగురికి వివిధ ఆలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చినా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రెవెన్యూ శాఖలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు దేవదాయ శాఖపై దృష్టి పెడుతున్నారు. ప్రధాన ఆలయాల్లో ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది మేజర్ ఆలయాలు ఉంటే ఆరు ఆలయాల్లో రెవెన్యూ శాఖకు చెందిన అధికారులే ఈవోలుగా విధులు నిర్వహిస్తున్నారు. సింహాచలం, కనకదుర్గమ్మ ఆలయం, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకంతో పాటు ఇప్పుడు శ్రీకాళహస్తి ఈవోగా రెవెన్యూ శాఖ నుంచి వచ్చిన వారే ఉన్నారు. కాగా రెవెన్యూ శాఖ అధికారుల నియామకం విషయంలో అంతర్గత యుద్ధం నడుస్తోంది. కొన్ని నెలల క్రితం దేవదాయ శాఖలోని కొంతమంది కీలక అధికారులు విశాఖలో ఓ స్వామిని కలిసి రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ అధికారులను తీసుకువచ్చి దేవదాయ శాఖలో నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విన్నవించారు. దీంతో ఆ స్వామి కూడా రెవెన్యూ శాఖ అధికారుల నియామకాన్ని ఆపాలని ప్రభుత్వానికి సూచించారు. పాత కమిషనర్ ఉన్నంత వరకూ రెవెన్యూ నుంచి ఒక్క అధికారిని కూడా దేవదాయ శాఖలోకి డిప్యూటేషన్‌పై తీసుకోలేదు. కానీ ఆలయాల్లో పాలన కుంటుపడుతోంది. కొంతమంది అధికారులు పాలనలోనే గాక ఆలయాల్లో ఉత్సవాల నిర్వహణ విషయంలోనూ విఫలమయ్యారు. వారు అవినీతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రభుత్వం మళ్లీ రెవెన్యూ అధికారులపై దృష్టిపెట్టింది. వాస్తవానికి దేవదాయ శాఖకు డీసీ కేడర్ అధికారులను నియమించుకునే అవకాశం ఉంది. కానీ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. దీంతో దేవదాయ శాఖలో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న నలుగురైదుగురిపై కూడా అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉండటంతో రెవెన్యూ శాఖ అధికారులపై ఆధారపడాల్సి వస్తోంది. దేవదాయ శాఖలో డీసీ కేడర్ పోస్టులు భర్తీతో పాటు పదోన్నతులు కల్పించాల్సిన అవసరం ఉంది.