Ramanaidu Studio: విశాఖలో మరో భారీ ‘భూ మార్పిడి’

ABN , First Publish Date - 2023-04-14T02:30:14+05:30 IST

విశాఖలో గుట్టుచప్పుడు కాకుండా మరో ‘భూమార్పిడి’ జరిగిపోయింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేతులు మారగా.. తాజాగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో ఇళ్ల స్థలాలకు అనుమతిచ్చారు.

Ramanaidu Studio: విశాఖలో మరో భారీ ‘భూ మార్పిడి’

రామానాయుడు స్టూడియోలో

61,429 చదరపు మీటర్లలో ఇళ్ల స్థలాలు

మార్కెట్‌ విలువ రూ.200 కోట్లకు పైనే

గతంలో ఎకరా 25 లక్షలకు కేటాయింపు

లేఅవుట్‌కు సురేశ్‌బాబు పేరిట దరఖాస్తు

సినీ పరిశ్రమ అభివృద్ధికి కేటాయించిన

భూమిలో అనుమతిపై సందేహాలు

వైసీపీ పెద్దల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం

కలెక్టర్‌ ఎన్‌వోసీ ఇచ్చినట్టు అధికారుల వెల్లడి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖలో గుట్టుచప్పుడు కాకుండా మరో ‘భూమార్పిడి’ జరిగిపోయింది. ఇప్పటికే పలు ప్రాజెక్టులు చేతులు మారగా.. తాజాగా సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూమిలో ఇళ్ల స్థలాలకు అనుమతిచ్చారు. విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన స్థలంలో లేఅవుట్‌ వేసుకునేందుకు జీవీఎంసీ అనుమతి ఇచ్చింది. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పదిహేనేళ్ల కిందట అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఇప్పుడు 61,429 చదరపు మీటర్లలో లేఅవుట్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఈ భూమి (దాదాపు 15 ఎకరాలు) విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుంది. అధికారులు నిబంధనల మేరకే నడుచుకున్నారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా? అనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం 2002, 2003 ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వం భీమిలి బీచ్‌రోడ్డులో తిమ్మాపురం వద్ద 54 ఎకరాల భూమిని స్టూడియో నిర్మాణం కోసం నిర్మాత దగ్గుబాటి రామానాయుడుకు కేటాయించింది. అప్పట్లో ఎకరాకు రూ.25 లక్షలు చొప్పున స్టూడియో యాజమాన్యం చెల్లించింది. అందులో కొంతభాగంలో స్టూడియోకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టగా, మిగిలిన భూమి ఖాళీగానే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో విలువైన భూములపై ఆ పార్టీ ముఖ్య నేతలు కన్నేశారు. అందులో భాగంగా కార్తీకవనం (రాడిసన్‌ హోటల్‌), బేపార్క్‌ చేతులు మారిపోయాయి. బీచ్‌రోడ్డులో కొండపై సముద్రానికి అభిముఖంగా ఉండే రామానాయుడు స్టూడియోను కూడా ఎలాగైనా చేజిక్కించుకునేందుకు పావులు కదిపారు.

9rama2.jpg

స్టూడియో భూములను లాక్కొనేందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతలు యత్నిస్తున్నారంటూ అప్పట్లో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అందరూ స్టూడియో విషయాన్ని మరిచిపోయారు. అయితే స్టూడియోకు కేటాయించిన భూమిలో 61,429 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మాణాలకు వీలుగా లేఅవుట్‌ వేసుకునేందుకు అనుమతి కోరుతూ స్టూడియో ఎండీ దగ్గుబాటి సురేశ్‌బాబు పేరిట జీవీఎంసీకి దరఖాస్తు అందింది. లేఅవుట్‌కు అనుమతి కోసం 15ు అంటే 7,283 చదరపు మీటర్లు భూమిని జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు పేరు తో మధురవాడ సబ్‌రిజిస్టర్‌ ఆఫీసులో మార్టిగేజ్‌ డీడ్‌ చేయించారు. అనంతరం లేఅవుట్‌కు జీవీఎంసీ కమిషనర్‌ టెంటేటివ్‌ లేఅవుట్‌ ప్యాట్రిన్‌(టీఎల్‌పీ) జారీ చేశారు. ఈ వ్యవహారం గుట్టుగా జరిగిపోవడంతో సర్వత్రా అనుమానాలకు దారితీస్తోంది. సా ధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్దేశంతో భూమి ని కేటాయించినప్పుడు అదే అవసరానికి వినియోగించాల్సి ఉంటుంది. మరేదైనా అవసరానికి వినియోగించాలనుకుంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందాలి లేదా భూమిని కేటాయించిన కలెక్టర్‌ నుంచి ఎన్‌వోసీ పొందాలి. అంతేగాక మాస్టర్‌ప్లాన్‌లో కూడా వాణిజ్య అవసరాలకు కేటాయించిన భూమిని నివాసిత అవసరాలకు వినియోగించుకోవచ్చుననే వెసులుబాటు పొందుపరచాలి. వీటన్నింటినీ పరిశీలించాకే జీవీఎంసీ అధికారులు లేఅవుట్‌కు అనుమతి ఇచ్చారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలు మొదట్నుంచి ఆ భూమిపై ప్రత్యేక ఆసక్తి చూపుతుండడంతో వారే తెరవెనుక నుంచి తతంగం నడిపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవీఎంసీలోని ఒక అధికారి వద్ద ఈ విషయం ప్రస్తావించగా.. జిల్లా కలెక్టర్‌ ఎన్‌ఓసీ ఇచ్చిన తర్వాతే తా ము అనుమతిచ్చామన్నారు. అంతా నిబంధనల ప్ర కారమే జరిగిందని, 2041 వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌లోనూ ఆ భూమిని వాణిజ్య, నివాస అవసరాలకు వాడుకోవచ్చునని పొందుపరిచారని వివరించారు.

Updated Date - 2023-04-14T02:30:15+05:30 IST