‘ఏక్’లవ్య!
ABN, First Publish Date - 2023-02-25T01:21:27+05:30
అరకులోయ, అనంతగిరి మండలాలకు రెండేళ్ల క్రితం మంజూరైన ఏకలవ్య పాఠశాలలకు చెందిన బాలురకు తాత్కాలికంగా అరకులోయలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లోని డైనింగ్ హాలులో తరగతులు నిర్వహిస్తున్నారు. వసతి కొరత కారణంగా రాత్రిపూట దీనినే హాస్టల్‌గా వినియోగించుకోవాల్సి వస్తున్నది. డైనింగ్ హాలును పాఠశాలగా వినియోగిస్తుండడంతో మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఆరు బయట చేయాల్సి వస్తున్నది. దీంతో విద్యార్థులు బోధన నుంచి వసతి వరకు రోజూ ఇబ్బందులు పడుతున్నారు.
రెండేళ్లయినా సొంత భవనాలకు నోచుకోని అరకులోయ, అనంతగిరి పాఠశాలలు
వైటీసీ డైనింగ్ హాలు తాత్కాలికంగా కేటాయింపు
మధ్యలో ట్రంకుపెట్టెలు పెట్టి 6, 7 తరగతుల నిర్వహణ
ఒకేసారి బోధనతో గందరగోళం
రాత్రిపూట ఇక్కడే బస.. ఆరు బయట భోజనాలు
తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన విద్యార్థులు
అరకులోయ, ఫిబ్రవరి 24:
అరకులోయ, అనంతగిరి మండలాలకు రెండేళ్ల క్రితం మంజూరైన ఏకలవ్య పాఠశాలలకు చెందిన బాలురకు తాత్కాలికంగా అరకులోయలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లోని డైనింగ్ హాలులో తరగతులు నిర్వహిస్తున్నారు. వసతి కొరత కారణంగా రాత్రిపూట దీనినే హాస్టల్‌గా వినియోగించుకోవాల్సి వస్తున్నది. డైనింగ్ హాలును పాఠశాలగా వినియోగిస్తుండడంతో మధ్యాహ్నం, రాత్రి భోజనాలను ఆరు బయట చేయాల్సి వస్తున్నది. దీంతో విద్యార్థులు బోధన నుంచి వసతి వరకు రోజూ ఇబ్బందులు పడుతున్నారు.
అరకులోయ, అనంతగిరి మండలాలకు 2021-22 విద్యా సంవత్సరంలో ఏకలవ్య పాఠశాలలు మంజూరయ్యాయి. సొంత భవనాల నిర్మాణానికి అవసరమైన భూమిని అప్పట్లో సేకరించలేదు. తొలి ఏడాది ఒక్క సెక్షన్(ఆరో తరగతి)కు అడ్మిషన్లు ప్రారంభించారు. ఒక్కో పాఠశాలలో ప్రతి తరగతిలో 60 సీట్లు వుండగా.. బాలురు, బాలికలకు చెరిసగం చొప్పున కేటాయించారు. స్థలం సేకరించి, భవనాలు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ భవనాల్లో పాఠశాలలను ప్రారంభించి తరగతులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మండలస్థాయి అధికారులు స్థానికంగా కొన్ని భవనాలను పరిశీలించారు. వివిధ కారణాల వల్ల వాటిని తీసుకోవడానికి వీలుకాలేదు. చివరకు అరకులోయలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో భోజనశాలను ఎంపిక చేశారు. అనంతగిరిలో ప్రభుత్వానికి చెందిన భవనాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో ఈ మండలానికి మంజూరైన పాఠశాలను కూడా తాత్కాలికంగా అరకులోయలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే బాలికలు, బాలురకు వేర్వేరుగా హాస్టళ్లను నిర్వహించడానికి వసతి లేకపోవడంతో వైటీసీలోని డైనింగ్ హాల్‌ను రెండు మండలాలకు చెందిన బాలురుకు కేటాయించి, బాలికలను యండపల్లివలసలోని బాలికల గురుకుల ఆశ్రమోన్నత పాఠశాలలో సర్దుబాటు చేశారు. ఇక్కడ (యండపల్లివలస) భవనాల కొరత లేకపోవడంతో తరగతుల నిర్వహణ, హాస్టల్‌కు ఎటువంటి ఇబ్బందులు లేదు. అయితే వైటీసీలో తొలిఏడాది రెండు మండలాల పాఠశాలల విద్యార్థులను (30+30) ఒకే సెక్షన్‌గా వుంచారు. రెండో ఏడాది (2022-23లో) 7వ తరగతి ప్రారంభం కావడంతో మరో 60 మంది విద్యార్థులు వచ్చారు. వైటీసీ డైనింగ్ హాలు మధ్యలో విద్యార్థుల ట్రంకుపెట్టెలను అడ్డుగాపెట్టి రెండు భాగాలుగా చేశారు. ఒకవైపు 6వ తరగతి, మరోవైపు 7వ తరగతి నిర్వహిస్తున్నారు. దీంతో రెండు తరగతుల టీచర్లు ఒకేసారి బోధిస్తుండడంతో పాఠాలు అర్థం కావడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టల్ కూడా ఇదే కావడంతో రాత్రిపూట ఇక్కడే బస. భోజనం చేయడానికి హాల్ లేకపోవడంతో పగటిపూట ఆరుబయట చేస్తున్నారు. రాత్రిపూట తరగతి గదుల్లోనే భోజనం చేసి, నిద్రించే ముందు శుభ్రం చేసుకుంటున్నారు. ఏకలవ్య పాఠశాలలకు నూతన భవన నిర్మాణాలను త్వరగా పూర్తి తమ ఇక్కట్లు తొలగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Updated Date - 2023-02-25T01:21:28+05:30 IST