ఆక్రమణలు తొలగింపు

ABN , First Publish Date - 2023-05-26T01:08:07+05:30 IST

జిల్లా కేంద్రంలో మెయిన్‌రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియకు అధికారులు గురువారం శ్రీకారం చుట్టారు. అయితే తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాల ముందు(రేకుల షెడ్‌లు) భాగాలను తొలగించడం అన్యాయమని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆక్రమణలు తొలగింపు
అంబేడ్కర్‌ కూడలిలో ఇరువైపులా తొలగిస్తున్న ఆక్రమణలు

పాడేరులో మెయిన్‌ రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీపై షెడ్లు నిర్మించిన వర్తకులు

నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో ఇక్కట్లు

జిల్లా కలెక్టర్‌కు పలువురు ఫిర్యాదు

ఎక్స్‌కవేటర్‌తో దుకాణాల ముందు షెడ్లు కూల్చివేత

ముందస్తు సమాచారం లేదంటున్న వ్యాపారులు

పలుమార్లు నోటీసులు ఇచ్చామంటున్న అధికారులు

పాడేరు, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో మెయిన్‌రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రక్రియకు అధికారులు గురువారం శ్రీకారం చుట్టారు. అయితే తమకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాల ముందు(రేకుల షెడ్‌లు) భాగాలను తొలగించడం అన్యాయమని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

పాడేరులో మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలను వర్తకులు ఆక్రమించి షెడ్‌లు నిర్మించుకున్నారు. దీంతో మురుగునీటి కాలువలను శుభ్రం చేయడానికి వీలుకావడంలేదు. దుకాణాల్లో వస్తువులు, సరకులు కొనుగోలు చేయడానికి వచ్చే వారు వాహనాలను రోడ్డుపైనే నిలుపుదల చేయాల్సి వస్తున్నది. దీంతో మొయిన్‌ రోడ్డు కుంచించుకుపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యపై పలువురు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. మెయిన్‌ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే జిల్లాస్థాయు అధికారులు సైతం ఈ సమస్యను నిత్యం చూస్తూనే వున్నారు. దీంతో రోడ్డుకి ఇరువైపుల డ్రైనేజీ కాలువలను ఆక్రమించి వ్యాపారులు వేసిన రేకుల షెడ్‌లను తొలగించాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ రెవెన్యూ, పోలీస్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులను ఆదేశించారు. సీఐ బి.సుధాకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు, సిబ్బంది గురువారం రంగంలోగి దిగారు.

యుద్ధప్రాతిపదికన ఆక్రమణలు తొలగింపు

జిల్లా కేంద్రంలో మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్న స్థలాన్ని పలువురు ఆక్రమించి వ్యాపారాలు సాగించడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. దీంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతున్నది. ముఖ్యంగా అంబేడ్కర్‌ కూడలి పరిసరాల్లో తరచూ ఈ సమస్య తలెత్తుతుండడంతో రోడ్డుపై ఉన్న చిరు వర్తకుల దుకాణాలను తొలగించాలని గతంలోనే పోలీసులు సూచించారు. కొన్ని దుకాణాలను తొలగించారు. కానీ కొద్ది రోజుల తరువాత మళ్లీ యథావిధిగా దుకాణాలు పెట్టేశారు. దీంతో అఽధికారులు గురువారం ఉదయం పాడేరు అంబేడ్కర్‌ కూడలి నుంచి ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ప్రారంభించారు. రోడ్డుకు ఇరువైపులా మురుగు కాల్వలను ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్‌లను ఎక్స్‌కవేటర్‌తో తొలగించడం మొదలుపెట్టారు. ఈ విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో అటు విశాఖపట్నం, ఇటు అరకులోయ వెళ్లే మార్గాల్లో మెయిన్‌రోడ్లను ఆక్రమించి వేసిన షెడ్‌లను దుకాణదారులు స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా షెడ్‌లను తొలగించడం అన్యాయమని పలువురు వర్తకులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆక్రమణదారులకు పలుమార్లు నోటీసులు ఇచ్చామని, బహిరంగ ప్రకటన కూడా చేశామని, అయినా స్వచ్ఛందంగా తొలగించకపోవడంతో కలెకర్‌ ఆదేశాలతో తాము రంగంలోకి దిగామని రెవెన్యూ, పోలీస్‌ అధికారులు అంటున్నారు.

విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా మురుగు కాల్వలపై ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఎక్స్‌కవేటర్‌తో బడ్డీలు, రేకుల షెడ్‌లను తొలగిస్తుండడంతో విద్యుత్‌ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్పారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పలుచోట్ల విద్యుత్‌ సరఫరా లేదు. ఈ సమయంలో ఎండ తీవ్రతకుతోడు ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2023-05-26T01:08:07+05:30 IST