Vishaka Steel Plant : ఛత్తీస్‌గఢ్‌ది ఉక్కు.. విశాఖది తుక్కా?
ABN , First Publish Date - 2023-10-21T03:20:46+05:30 IST
పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో దేశంలోని పలు స్టీల్‌ప్లాంట్ల విక్రయానికి బీజేపీ ప్రభుత్వం చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది.
ప్రైవేటీకరణపై కేంద్రం ద్వంద్వ వైఖరి
400 మంది ఉద్యోగులు..బిడ్ దశ దాటిన ప్రైవేటీకరణ ప్రక్రియ.. అయినా ఛత్తీ్‌సగఢ్‌లోని నగర్నార్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపివేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటన!
25 వేలమంది ఉద్యోగులు.. ‘ఆసక్తి వ్యక్తీకరణ’ దగ్గరే ఉన్న ప్రక్రియ.. ప్రైవేటీకరణ ఆపాలని వెయ్యి రోజులుగా కార్మికుల నిరాహార దీక్షలు! అయినా.. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగానే కేంద్రం అడుగులు!
భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరికి ఇంతకుమించిన ఉదాహరణ కావాలా అని విశాఖ స్టీల్ ప్లాంటు కార్మికులు ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇది కాదా అని నిలదీస్తున్నారు.
విశాఖ స్టీల్‌పై మొండిగా కేంద్రం
అమ్మకానికి వడివడిగా అడుగులు
సహకరిస్తున్న జగన్ సర్కారు
మరోవైపు ఛత్తీ్‌సగఢ్‌లో అమిత్‌షా భిన్నమైన ఎన్నికల ప్రకటన
నగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని హామీ
బీజేపీ తీరుపై సర్వత్రా విస్మయం
విశాఖలో వెయ్యి రోజులుగా నిరసనలు
అయినా స్పందించని కేంద్రం
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)
పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో దేశంలోని పలు స్టీల్‌ప్లాంట్ల విక్రయానికి బీజేపీ ప్రభుత్వం చాలాకాలం క్రితమే నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరు స్టీల్‌ప్లాంట్లను విక్రయించాలని నిర్ణయించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు(సెయిల్) చెందిన స్టీల్ ప్లాంట్లు మూడు ఉన్నాయి. సేలం (తమిళనాడు), భద్రావతి (కర్ణాటక), దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్). ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ కాకుండా ఇతర పార్టీలు (ఇండియా కూటమి) అధికారంలో ఉన్నాయి. ప్రైవేటీకరణకు అక్కడి ప్రభుత్వాలు సహకరించకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు వెళ్లడం లేదు. మిగతా స్టీల్‌ప్లాంట్లలో ఒడిశాలో నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.. ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలో కాకుండా వాణిజ్య శాఖలో భాగంగా ఉండడంతో దాని విక్రయ ప్రక్రియ పూర్తిచేశారు. ఇక మిగిలినవి రెండు. అందులో ఒకటి విశాఖ స్టీల్‌ప్లాంటు. రెండోది ఛత్తీ్‌సగఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంటు. దీనిని మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎన్‌ఎండీసీ) నిర్మించింది. ఏడాదికి 30లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కోసం రూ.28,500 కోట్లు వెచ్చించారు. అక్కడ 400 మంది మాత్రమే ఉద్యోగులున్నారు. దీనిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. నవంబరులో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నగర్నార్ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడికి ప్రచారానికి వెళ్లారు. స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణపై వ్యతిరేకత చూసి బీజేపీని గెలిపిస్తే ప్లాంటును ప్రభుత్వరంగంలోనే కొనసాగిస్తామని ప్రకటించారు.
ఏపీలో వెయ్యి రోజులుగా ఆందోళన
విశాఖ స్టీల్‌ప్లాంటు 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పాటైంది. దీనిని ప్రైవేటీకరించడానికిబీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తీరును నిరసించడం లేదు. ఇక్కడ 25 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. నాణ్యమైన స్టీల్ తయారీలో విశాఖ ఉక్కుకు ఎంతో పేరు ఉంది. దీనిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికులు వేయి రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ ఆందోళనలను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ పట్టించుకోవడం లేదు. ఇక్కడ ప్లాంటు అమ్మకానికి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన కూడా ఇంకా విడుదల చేయలేదు. అక్కడ నగర్నార్‌లో బిడ్డింగ్ దశ కూడా పూర్తయింది. ఇటువంటి తరుణంలో దానిని ప్రైవేటీకరణ చేయబోమని బీజేపీ హామీ ఇచ్చింది. మరి ఇక్కడ ఎందుకు ఆ హామీ ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ‘నగర్నార్ ప్లాంటు ప్రైవేటీకరణ ఆపుతామని అమిత్‌షా చేసిన ప్రకటనను హర్షిస్తున్నాం. అలాగే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను కూడా ఆపుతామని ప్రకటించాలి’’ అని విశాఖ ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ డిమాండ్ చేశారు.