రోడ్లను తవ్వేస్తున్నారు
ABN , First Publish Date - 2023-03-24T23:56:02+05:30 IST
బొబ్బిలి మునిసిపాల్టీలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి పనుల పేరిట విధ్వంసాలకు దిగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీసీ రహదారులను కల్వర్టుల నిర్మాణం పేరిట ధ్వంసం చేస్తుండడంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయుడుకాలనీలో ఇటీవల 14 వ ఆర్థిక సంఘం నిధులతో రోడ్లు,కాలువలు ఏర్పాటుచేశారు.
రోడ్లను తవ్వేస్తున్నారు
కల్వర్టు నిర్మాణానికి రహదారులు ధ్వంసం
అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు
మునిసిపల్ అధికారుల తీరుపై విమర్శలు
(బొబ్బిలి)
బొబ్బిలి మునిసిపాల్టీలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. అభివృద్ధి పనుల పేరిట విధ్వంసాలకు దిగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీసీ రహదారులను కల్వర్టుల నిర్మాణం పేరిట ధ్వంసం చేస్తుండడంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయుడుకాలనీలో ఇటీవల 14 వ ఆర్థిక సంఘం నిధులతో రోడ్లు,కాలువలు ఏర్పాటుచేశారు. కానీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాటుచేయకపోవడంతో మురుగు, వాడుక నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో స్థానికులు అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకొచ్చారు. అయితే మునిసిపల్ అధికారులు ఏమనుకున్నారో ఏమో.. కానీ కల్వర్టుల నిర్మాణం పేరుతో కాలనీలోని ప్రధాన రహదారిలో రెండుచోట్ల పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో రోడ్డులో నడిచేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో వీధి చివర్లో వాహనాలను పార్కింగ్ చేసుకొని ఇంటికి చేరుతున్నారు. ఇదే అదునుగా రాత్రిపూట వాహనాల్లో పెట్రోల్, డీజిల్ దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అయితే శుక్రవారం మరోచోట రహదారిని తవ్వేశారు. దీనిపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒకచోట కల్వర్టుపై తాత్కాలిక పలకలు వేసి చేతులు దులుపుకున్నారు. పోనీ కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టారంటే అదీ లేదు. దీంతో మునిసిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సత్వర చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
అసౌకర్యానికి గురవుతున్నాం
రోడ్డు తవ్వేయడంతో అసౌకర్యానికి గురవుతున్నాం. కనీసం ప్రత్యామ్నాయంగా వేరే మార్గం లేదు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారుల తీరు సరికాదు. పోనీ ఒక కల్వర్టు నిర్మాణం పూర్తయ్యాక.. మరోకదానిపై దృష్టిపెడితే బాగుండేది. దీనికి అధికారులే సమాధానం చెప్పాలి.
సీహెచ్ త్రినాథ, రిటైర్డ్ టీచర్, నాయుడు కాలనీ
నిర్ణయం సరికాదు
గతంలో రహదారులు నిర్మించిన సమయంలోనే కాలువలు ఏర్పాటుచేయాల్సి ఉంది. కానీ అధికారులు దానిని విస్మరించారు. ఇప్పుడు కల్వర్టుల నిర్మాణం పేరిట రహదారులను ధ్వంసం చేస్తున్నారు. ఇది చాలా దారుణం. అధికారుల తీరు సరికాదు.
జీఏ నాయుడు, ఉపాధ్యాయుడు,నాయుడు కాలనీ