నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే అదానీపై చర్యలు: సెబీ
ABN , First Publish Date - 2023-07-11T04:15:42+05:30 IST
భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి చెం దిన అదానీ గ్రూప్ ఏదైనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని పెట్టుబడుల మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సుప్రీంకోర్టుకు...
న్యూఢిల్లీ: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి చెం దిన అదానీ గ్రూప్ ఏదైనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు రుజువైతే తగిన చర్యలు తీసుకుంటామని పెట్టుబడుల మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సుప్రీంకోర్టుకు తెలిపింది. అంతేకాదు, దేశీయ కంపెనీల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడుల అంతిమ లబ్ధిదారులను గుర్తింపునకు సంబంధించి సుప్రీంకోర్టు నియమిత నిపుణుల కమిటీ అభిప్రాయంతో సెబీ విబేధించింది. విదేశీ పెట్టుబడులకు సంబంధించి 2019లో సవరించిన నిబంధనలను సమర్థించుకున్న నియంత్రణ మండలి.. తత్ఫలితంగా అంతిమ లబ్ధిదారుల గుర్తింపు మరింత కష్టతరమైందనడం సరికాదని అంటోంది. పైగా, విదేశీ పెట్టుబడుల అంతిమ లబ్ధిదారులు, సంబంధిత వర్గాలతో లావాదేవీలకు (రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్) సంబంధించిన నిబంధనలను ఎప్పటికప్పుడు కఠినతరం చేయడం జరిగిందని సుప్రీంకోర్టుకు సోమవారం సమర్పించిన 43 పేజీల అఫిడవిట్‌లో సెబీ పేర్కొంది. కాగా, అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందనడానికి, నియంత్రణ వైఫల్యానికి ఆధారాల్లేవన్న నిపుణుల కమిటీ.. అదానీ గ్రూప్‌లో భారీగా పెట్టుబడులు కలిగిన విదేశీ ఫండ్ల అసలు లబ్ధిదారులు ఎవరనేది గుర్తించడానికి 2014-19 మధ్యకాలంలో సెబీ సడలించిన నిబంధనలే అవరోధంగా మారాయని మే నెలలో సుప్రీంకోర్టుకు సమర్పించిన తాత్కాలిక నివేదికలో పేర్కొంది. అదానీ గ్రూప్ చాలాకాలంగా అకౌంటింగ్ మోసాలకు పాల్పడటంతోపాటు విదేశీ సంస్థల పెట్టుబడుల ద్వారా గ్రూప్ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచుకుంటూ వచ్చిందని అమెరికన్ మార్కెట్ రీసెర్చ్, షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ ఈ జనవరి 24న ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో అదానీ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీతోపాటు చిన్న మదుపరులు భారీగా నష్టపోయారు. ఈ విషయంపై దర్యాప్త చేయాలని ఈ ఏడాది మార్చి 2న సెబీని ఆదేశించిన సుప్రీంకోర్టు ఆ వ్యవహారంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.