Demonetization: ఆరేళ్లలో 83% పెరిగిన కరెన్సీ చలామణి

ABN , First Publish Date - 2023-01-03T01:39:36+05:30 IST

పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచినప్పటికీ వ్యవస్థలో ఇంకా నగదు హవానే కొనసాగుతోంది. ఈ ఆరేళ్లలో ప్రజల వద్దనున్న నగదు దాదాపు రెట్టింపైంది...

Demonetization: ఆరేళ్లలో 83% పెరిగిన కరెన్సీ చలామణి

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేసి ఆరేళ్లు గడిచినప్పటికీ వ్యవస్థలో ఇంకా నగదు హవానే కొనసాగుతోంది. ఈ ఆరేళ్లలో ప్రజల వద్దనున్న నగదు దాదాపు రెట్టింపైంది. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. 2016 నవంబరు 4 నాటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల మొత్తం విలువ రూ.17.74 లక్షల కోట్లు కాగా, 2022 డిసెంబరు 23 నాటికి రూ.32.42 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే, చలామణిలో ఉన్న కరెన్సీ విలువ 83 శాతం పెరిగింది. డీమానిటైజేషన్‌ స్వల్పకాలిక ప్రభావంతో 2017 జనవరి నాటికి వ్యవస్థలో కరెన్సీ చలామణి రూ.9 లక్షల కోట్లకు తగ్గింది. ఆ స్థాయితో పోలిస్తే, ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ దాదాపు మూడు రెట్లు (260 శాతం) పెరిగింది. చలామణిలో ఉన్న నగదు విలువే కాదు, నోట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 90,266 మిలియన్‌ నోట్ల నుంచి 2022 మార్చి 31 నాటికి 1,30,533 మిలియన్‌ నోట్లకు చేరుకుంది. ప్రస్తుతం వ్యవస్థలో రూ.2, 5, 10, 20, 50, 100, 200, 500, 2000 డినామినేషన్‌ నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.1,000, రూ.500 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబరు 8న రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటికి వ్యవస్థలో చలామణి అవుతున్న అన్ని కరెన్సీ నోట్ల మొత్తం విలువలో ఈ రెండింటి వాటాయే దాదాపు 86 శాతం. ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని అరికట్టడంతో పాటు నకిలీ నోట్లను ఏరివేసేందుకే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించి డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించనున్నట్లు తెలిపింది.

నోట్ల రద్దు తర్వాత మార్కెట్లో డిజిటల్‌ లావాదేవీలు భారీగా పుంజుకున్నప్పటికీ, చలామణిలో ఉన్న నగదు విలువ కూడా పెరుగుతూ వచ్చింది. అందర్నీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఈ నిర్ణయం తన లక్ష్యాలను మాత్రం సాధించలేకపోయిందని ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. కరెన్సీ చలామణి గణాంకాలూ అదే సంకేతమిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కనీసం రూ.3-4 లక్షల కోట్ల నల్లధనం వ్యవస్థ నుంచి వైదొలుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, అందుకు భిన్నంగా రద్దు చేసిన నగదులో 99.3 శాతం తిరిగి వ్యవస్థలోకి ప్రవేశించింది. రద్దు చేసిన పెద్ద నోట్ల మొత్తం విలువ రూ.15.41 లక్షల కోట్లు కాగా.. వాటిని కొత్త నోట్లతో మార్చుకునే వెసులుబాటు కల్పించడంతో రూ.15.31 లక్షల కోట్ల విలువైన కరెన్సీ తిరిగి వ్యవస్థలోకి వచ్చి చేరింది. అంతేకాదు, ఇప్పటివరకు ఎంత నల్లధనం పట్టుబడిందనే దానిపైనా పక్కా వివరాలు లేవు. పెద్ద నోట్ల తర్వాత కూడా వ్యవస్థలోకి నకిలీ నోట్ల ప్రవాహం ఆగలేదు. గత ఆర్థిక సంవత్సరంలో పట్టుబడిన నకిలీ నోట్లు 10.7 శాతం పెరిగాయి.

2022 మార్చి 31 నాటికి నగదు చలామణి విలువ

సంవత్సరం రూ.లక్షల కోట్లు

2017 13.10

2018 18.03

2019 21.10

2020 24.20

2021 28.26

2022 31.05

Updated Date - 2023-01-03T11:27:16+05:30 IST