Share News

Shaktikanta Das : ఐదోసారీ అదే రేటు

ABN , First Publish Date - 2023-12-09T04:34:01+05:30 IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది.

 Shaktikanta Das : ఐదోసారీ అదే రేటు

రెపో రేటు 6.5% మళ్లీ యథాతథం

ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్‌బీఐ

వృద్ధి అంచనా అర శాతం పెంపు

ద్రవ్యోల్బణ అంచనాల్లో మార్పులేదు..

వచ్చే ఫిబ్రవరి 6-8 తేదీల్లో తదుపరి సమీక్ష

ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీ (రెపో) రేట్లను వరుసగా ఐదోసారీ యథాతథంగా కొనసాగించింది. సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల పాటు సమావేశమైంది. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటును అదే స్థాయిలో కొనసాగించాలని సభ్యులు ఏకగ్రీవంగా ఓటు వేశారు. కాగా, వడ్డీ రేట్లపై సానుకూల వైఖరిని క్రమంగా ఉపసంహించుకోవాలన్న విధానానికి ఒక్కరు మినహా మిగతా ఐదుగురు మద్దతు పలికారు. వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చనడానికి ఇది సంకేతం. తదుపరి సమీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరి 6-8 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించడాన్ని బ్యాంకర్లు, రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు స్వాగతించాయి. కాగా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో గానీ ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాల్లేవని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫిన్‌టెక్‌ రిపాజిటరీ ఏర్పాటు

సాంకేతికత ఆధారంగా ఆర్థిక సేవలందించే (ఫిన్‌టెక్‌) రంగంలో పరిణామాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంతో పాటు ఈ రంగానికి మద్దతిచ్చేందుకు ఫిన్‌టెక్‌ రిపాజిటరీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ దీన్ని 2024 ఏప్రిల్‌ లేదా అంతకంటే ముందే అందుబాటులోకి తేనుందని దాస్‌ తెలిపారు. ఫిన్‌టెక్‌ కంపెనీలు స్వచ్ఛందంగా సమాచారాన్ని రిపాజిటరీకి అందించే దిశగా ప్రోత్సహించనున్నట్లు దాస్‌ చెప్పారు.

డిజిటల్‌ చెల్లింపులకు మరింత ప్రోత్సాహం

ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూపీఐ ద్వారా చెల్లింపుల పరిమితి రూ.5 లక్షలకు పెంపు

ఓటీపీ అవసరం లేని పునరావృత చెల్లింపుల లిమిట్‌ రూ.లక్షకు పెంచిన ఆర్‌బీఐ

దేశంలో శరవేగంగా పుంజుకుంటున్న డిజిటల్‌ చెల్లింపులకు ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలకు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ద్వారా చెల్లింపుల పరిమితిని రూ.లక్ష నుంచి ఏకంగా రూ.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది. తద్వారా అత్యవసర సమయాల్లో ఆసుపత్రి బిల్లు, విద్యార్థుల ఫీజు మరింత సులభంగా చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. కాగా, ప్రస్తుతం ఎలకా్ట్రనిక్‌ ఆదేశం (ఈ-మాండేట్‌) ఫ్రేమ్‌వర్క్‌లో రూ.15,000పైగా విలువైన పునరావృత చెల్లింపుల (రికరింగ్‌ పేమెంట్స్‌) అదనపు ధ్రువీకరణ (అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌-ఏఎ్‌ఫఏ) అవసరం. ఈ పరిమితిని రూ.లక్షకు పెంచాలని ఆర్‌బీఐ తాజాగా ప్రతిపాదించింది. అంటే, రూ.లక్ష వరకు రికరింగ్‌ చెల్లింపులకు ఓటీపీ అథెంటికేషన్‌ అవసరం ఉండదు. ఈ కొత్త లిమిట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌, క్రెడిట్‌ కార్డ్‌ రీపేమెంట్లకు మాత్రమే వర్తిస్తుంది.

వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గించే ఆలోచన లేదు..

ఆర్‌బీఐకి ఇప్పట్లో వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచన లేదు. దీర్ఘకాలం పాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతంలోపు నియంత్రిచడం ద్వారా ధరల స్థిరత్వాన్ని సాధించడమే మానిటరీ పాలసీ ప్రథమ కర్తవ్యం. 2022 మే నెలలో మా దృష్టిని వృద్ధి నుంచి ధరల నియంత్రణ వైపు మళ్లించాం. ఇప్పటికీ అదే వైఖరిని కొనసాగిస్తున్నాం. దీంట్లో మార్పులేదు. ఎందుకంటే, ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి కట్టడి చేసేందుకు చాలా కృషి చేయాల్సి ఉంది.

- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ద్రవ్యోల్బణం అంచనా 5.4 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతంగా నమోదు కావచ్చన్న గత అంచనాను ఆర్‌బీఐ యఽథాతథంగా కొనసాగించింది. అయితే, ఆహార ధరలు ఒక్కసారిగా పెరిగిన కారణంగా ఈ నవంబరు, డిసెంబరు నెలలకు ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకవచ్చని శక్తికాంత దాస్‌ సంకేతాలిచ్చారు. ఈ జూలైలో 7.4 శాతంగా నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. అక్టోబరులో 4.9 శాతానికి దిగివచ్చింది. ఈ రబీ సీజన్‌లో ధాన్యాలు, పప్పులు, మసాలాలు వంటి కీలక పంటల సాగును నిశితంగా గమనించనున్నామన్న దాస్‌.. అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈసారి 7% వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24) జీడీపీ వృద్ధి రేటు అంచనా ను 6.5 శాతం నుంచి 7 శాతానికి పెంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. దేశీయంగా వస్తు గిరాకీతో పాటు మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో ఉత్పత్తి సామర్థ్య వినియోగం కూడా పెరిగిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సుదీర్ఘ భౌగోళిక రాజకీయ సంక్షోభాలతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బీటలు వారుతుండటం మన వృద్ధి జోరుకు అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయని శక్తికాంత దాస్‌ హెచ్చరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతం, సెప్టెంబరుతో ముగిసిన క్యూ2లో 7.6 శాతంగా నమోదైంది. డిసెంబరుతో ముగియనున్న క్యూ3లో జీడీపీ వృద్ధి 6.5 శాతం, వచ్చే మార్చితో ముగియనున్న క్యూ4లో 6 శాతంగా నమోదు కావచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. అంతేకాదు, వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) క్యూ1, క్యూ2, క్యూ3లో వృద్ధి రేటు వరుసగా 6.7 శాతం, 6.5 శాతం, 6.4 శాతంగా ఉండవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ భావిస్తోంది.

Updated Date - 2023-12-09T04:34:02+05:30 IST