ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సహృదయత సన్నగిల్లిందేమి?

ABN, First Publish Date - 2023-03-29T00:47:43+05:30

‘మీరురాజ్యసభ చైర్మన్‌గా లేకపోవడం ఎంతో వెలితిగా కనిపిస్తోంది. మాతో ఇప్పుడు సరిగా మాట్లాడే వారే కనపడడం లేదు’ – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురి సమక్షంలో శివసేన ఎంపి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘మీరురాజ్యసభ చైర్మన్‌గా లేకపోవడం ఎంతో వెలితిగా కనిపిస్తోంది. మాతో ఇప్పుడు సరిగా మాట్లాడే వారే కనపడడం లేదు’ – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పలువురి సమక్షంలో శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది మాజీ అన్న మాటలవి. ఉగాది పర్వదినం సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 20న వెంకయ్యనాయుడు నిర్వహించిన ‘ఉగాది మిలన్’ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు కేంద్రమంత్రులు, పాలక, ప్రతిపక్షాల ఎంపీలు పలువురు హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు వారంతా సుహృద్భావ పూర్వకంగా ముచ్చటించుకున్నారు. చూడముచ్చటైన ఈ దృశ్యం ఇటీవలి కాలంలో ఎక్కడా కనిపించలేదు. వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ భావజాలానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయనలాగా అన్ని పార్టీల నేతలతో మాట్లాడగలిగిన నాయకుడు ఎవరూ ఇప్పుడు ఆ పార్టీలో లేరు. పాలక, ప్రతిపక్షాల సభ్యుల మధ్య అసలు మాట్లాడుకునే వాతావరణమే లేకుండా పోయింది. ఇరుపక్షాల వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఎంపీలతో మాట్లాడి పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిచే వాతావరణం కల్పించాల్సిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రులు సైతం సభలో ప్రవేశించగానే విపక్షాలపై తీవ్ర విమర్శలు చేసి వారిని రెచ్చగొడుతున్నారు. సభలో అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం కల్పించాల్సిన సభాధ్యక్షులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకుగాను గుజరాత్‌లోని ఒక కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. తీర్పు వచ్చీ రాగానే లోక్‌సభ సభ్యత్వానికి రాహుల్ అనర్హుడుగా ప్రకటించారు. అనర్హత వేటు వేసిన మరునాడే జన్‌పథ్‌లో ఇల్లు ఖాళీ చేయమని ఆయనకు నోటీసు పంపారు. చకా చకా సంభవించిన ఈ పరిణామాలతో భారతీయ జనతా పార్టీకి గాని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గానీ సంబంధం లేదని సమాజంలో అత్యధిక శాతం విద్యావంతులు, మేధావులు విశ్వసించడం లేదు. బిజెపి నేతలు కూడా అనధికారిక సంభాషణల్లో రాహుల్‌పై తమ అధిష్ఠానం ఎందుకింత వ్యక్తిగత ద్వేషంతో వ్యవహరిస్తున్నదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రతిపక్షాలపై ఏ కేసు మోపినా దానికి మోదీయే కారణమన్న పరిస్థితి ఇప్పుడు తలెత్తింది. ఇది కచ్చితంగా మోదీ వ్యక్తిగత ప్రతిష్ఠకు తీవ్ర నష్టం కలిగించే విషయం. అసలు చర్చలు, సంప్రదింపులు, పరస్పర గౌరవాదరాలతో ఒకరి సమస్యలను మరొకరు పరిష్కరించుకునే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టింది మోదీయే అని జనం భావించే పరిస్థితి ఏర్పడింది.

ప్రజా జీవితంలో వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలకు తావు లేదు. రాజనీతిజ్ఞులు అయిన వారు స్వీయ అభిమాన దురభిమానాలకు అతీతంగా వ్యవహరిస్తారు. 2007 డిసెంబర్‌లో ఆడ్వాణీ ఒక రోజు ఢిల్లీ విమానాశ్రయంలోని లాంజ్‌లో కూర్చుని ఉండగా అక్కడికి అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ వచ్చారు. గుజరాత్‌లో ఒక ఎన్నికల సభలో పాల్గొనేందుకు ఆడ్వాణీ వెళుతుండగా, ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గానికి రాహుల్ వెళుతున్నారు. అద్వాణీని చూడగానే రాహుల్ ఆయన వద్దకు నడుచుకుంటూ వెళ్లి గౌరవపూర్వకంగా అభిమానంతో పలకరించారు.. ‘ఆడ్వాణీజీ.. మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. నన్ను నేను మీకు పరిచయం చేసుకొనే అవకాశం నాకు ఎప్పుడూ లభించలేదు’ అన్నారు. పిన్న వయస్కుడైన రాహుల్ తన పట్ల చూపిన సహజమైన మర్యాద, తన వయస్సుకు ఇచ్చిన గౌరవం ఆయన తండ్రి రాజీవ్‌గాంధీని జ్ఞప్తికి తెచ్చిందని ఆడ్వాణీ తన ఆత్మకథలో పేర్కొన్నారు. ‘బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు జాతీయ అంశాలపై కీలక ఏకాభిప్రాయ సాధన ఏర్పరచుకోవడం ఎంతో అవసరం. ఈ రెండు పార్టీలు ఒకదానినొకటి శత్రువుగా చూడనవసరం లేదు. నిజానికి ప్రజాస్వామ్యంలో శత్రుత్వమనే భావనే అనారోగ్యకరమైనది’ అని రాహుల్‌తో ఆడ్వాణీ అన్నారు. ‘నా అభిప్రాయం కూడా అదే’ అని రాహుల్ ఏకీభవించారు.

రాజకీయ విషయాలపై మాత్రమే కాదు, వ్యక్తిగత వ్యవహారాలలో కూడా రాజనీతిజ్ఞులు పరస్పరం సహాయం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తన పట్ల రాజీవ్ గాంధీ ప్రదర్శించిన సహృదయతను వాజపేయి ఒక సందర్భంలో బహిరంగంగా వెల్లడించారు. తనకు కిడ్నీ దెబ్బతిన్నప్పుడు ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెప్పారని, ఆ శస్త్ర చికిత్స ఖర్చును భరించే స్థితిలో తాను లేనని వాజపేయి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ అమెరికాకు వెళ్లే పార్లమెంటరీ ప్రతినిధి వర్గంలో తన పేరును చేర్చి తనకు చికిత్స ప్రభుత్వ ఖర్చుతో జరిగేలా చూశారని ఆయన తెలిపారు. వాజపేయి, పీవీ నరసింహారావుల మధ్య కూడా వ్యక్తిగత సన్నిహిత సంబంధాలు ఉండేవి. కశ్మీర్‌పై పాకిస్థాన్ తీర్మానాన్ని అడ్డుకోవడానికి వాజపేయిని ఐక్యరాజ్యసమితికి పంపించేందుకు పీవీ వెనుకాడలేదు. అంతేకాదు, వాజపేయి రాసిన కవితల సంపుటిని ప్రధాని హోదాలో ఉన్న పీవీ ఆవిష్కరించారు. పదవి కోల్పోయాక పీవీ రాసిన ఆత్మకథాత్మక నవల ‘ఇన్ సైడర్’ను వాజపేయి ఆవిష్కరించారు. దేశభద్రత విషయంలో కూడా ఇరువురూ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా వ్యవహరించారు. వాజపేయి హయాంలో పోఖ్రాన్‌లో అణు పరీక్షలు జరిగినప్పటికీ ఈ అణు పరీక్షల ఘనత పీవీకే దక్కుతుందని, ఆయనే వాటికి రంగం సిద్ధం చేసి తనకు ‘సామాగ్రీ తయార్ హై’ అని చెవిలో చెప్పారని వెల్లడించేందుకు వాజపేయి వెనుకాడలేదు.

రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి సహృదయతను నేతలు ప్రదర్శించిన సందర్భాలున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజు మధ్యాహ్నం ఢిల్లీలో ఏపీ భవన్‌లోని స్వర్ణముఖిలో డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేత రాజశేఖర్ రెడ్డి ఏపీభవన్‌లో అడుగుపెట్టారు. చెమటలు తుడుచుకుంటూ అక్కడున్న సిబ్బందిని ‘చంద్రుడేడీ’ అని అడిగారు. రాజశేఖర్ రెడ్డి వచ్చాడన్న విషయం తెలియగానే చంద్రబాబు నాయుడు తన సమావేశాన్ని వెంటనే ముగించి బయటకు వచ్చి వైఎస్‌ను కౌగలించుకున్నారు. లోపలికి తీసుకువెళ్లి సమాలోచనలు జరిపారు. వైఎస్‌కు తలెత్తిన ఒక వ్యక్తిగత సమస్యను చంద్రబాబు అక్కడికక్కడే పరిష్కరించారని సమాచారం. ఈ సమావేశం తర్వాత వైఎస్ నవ్వుతూ బయటకు వచ్చి విలేఖరులను పలకరించి వెళ్లారు. ఈ ఘటనకు ప్రస్తుత టీడీపీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణే సాక్ష్యం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో కూడా చంద్రబాబు పట్ల అంతే సహృదయతతో వ్యవహరించారని అనేవారు. రాజకీయాల్లో ప్రత్యర్థులైనంత మాత్రాన శత్రువులుగా మారనక్కర్లేదు అని ఆడ్వాణీ అన్న వాక్యాలకు అనుగుణంగా దేశంలో అనేకమంది రాజకీయ నాయకులు వ్యవహరించారనడానికి ఇలాంటి అనేక దృష్టాంతాలను ఉదహరించవచ్చు. కాని ఆడ్వాణీ శిష్యుడైన నరేంద్రమోదీ వైఖరి ఇందుకు భిన్నంగా ఉన్నది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరి మూలంగా ప్రస్తుతం దేశంలోని ప్రతిపక్ష నేతలంతా ఆత్మరక్షణలో ఉన్నారు. బిజెపిలో ఉన్న నేతలకు కూడా మోదీ అంటే గౌరవం కన్నా భయం ఎక్కువ ఉన్నదని అర్థమవుతోంది. మోదీని విమర్శిస్తే ఏమి జరుగుతుందో అన్న భయాందోళనలు మీడియా, మేధో వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్‌నేత ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్‌కు పద్మ భూషణ్ పురస్కారాలు అందించినప్పుడు రాజకీయాల్లో అస్పృశ్యత అంటే తనకు గిట్టదని, ఏకాభిప్రాయం ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటానని మోదీ తన పార్టీ ఎంపిలకు చెప్పారు. ఇలాంటి మాటలు అన్నప్పుడు మోదీలో ఒక అపరిచితుడు కనిపిస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుత రాజకీయాలలో విమర్శను, చర్చను సహించలేని ఒక నిరంకుశ స్వభావుడే ఇప్పుడు ఆయనలో గోచరిస్తున్నారు.. ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలుండవు’ అని ఒకప్పటి కాంగ్రెస్ నేత విబి రాజు ఎన్నో దశాబ్దాల క్రితం అన్న మాటల్ని మోదీ తన స్వభావం ద్వారా నిరూపిస్తున్నారు. ఎన్ని చేసినా కాంగ్రెస్‌లో కదలిక తేలేకపోయారని నిన్నమొన్నటి వరకూ విమర్శలు ఎదుర్కొన్న రాహుల్, ఇప్పుడు మోదీ పుణ్యమా అని దేశ రాజకీయ యవనికపై ప్రధాన పాత్రధారుడుగా అవతరించే క్రమం ప్రారంభమైంది. అయితే భావి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు పరాజయం చెందుతారు అన్న దానిపై కంటే మనం దృష్టి పెట్టవలసిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రజాస్వామ్య సంస్కృతికి, వ్యవస్థలకూ ఏర్పడ్డ ఎనలేని నష్టం ఎలా పూడ్చుకోగలుగుతాము? అంగుష్ఠ మాత్రులైన నేటి రాజకీయవేత్తల స్థానంలో సమున్నత వ్యక్తిత్వం గల నేతలు ఎప్పుడు మళ్లీ మనకు లభ్యమవుతారు? అన్న అంశాలపై చర్చ అవసరం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2023-03-29T00:47:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising