Basara IIIT: చదువుకోసం వస్తే ప్రాణాలెందుకుపోతున్నాయి..! యాప్‌తోనైనా మార్పు వస్తుందా?
ABN, First Publish Date - 2023-08-11T11:36:12+05:30
గ్రామీణ పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్ ఐటీలో వరుసగా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తిచేయాలనే లక్ష్యం దిశగా సాగకుండా ప్రాణాలెందుకు తీసుకుంటున్నారు. అంటే..
ఆటాపాటల్లేవు!
బాసర ట్రిపుల్ ఐటీలో ఆహ్లాదకర వాతావరణం కరువు...
క్లాసులకు వెళ్లడం, హాస్టల్‌కు రావడం.. రోజంతా రొటీన్
కార్పొరేట్ తరహాలో ఆంక్షలు, నిర్బంధం
పేరెంట్స్‌కు హాస్టల్ గదులను స్వేచ్ఛగా పరిశీలించే చాన్సే లేదు
మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు
విద్యార్థుల మానసిక స్థితి అధ్యయనం కోసం ప్రత్యేక యాప్
బాసర, ఆగస్టు 10: గ్రామీణ పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ట్రిపుల్ ఐటీలో (Basara IIIT) వరుసగా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తిచేయాలనే లక్ష్యం దిశగా సాగకుండా ప్రాణాలెందుకు తీసుకుంటున్నారు. అంటే.. వ్యక్తిగత, అనారోగ్య సమస్యలే కారణం అని చెబుతున్నా క్యాంపస్ వాతావరణమే అసలు కారణం అనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. చక్కని తరగతి గదులు, గొప్ప అధ్యాపకులు ఉన్నా.. మానసిక ఉల్లాసం కోసం ఆహ్లాదకరమైన పరిసరాలు ఉంటేనే విద్యార్థుల అభ్యసన స్థాయులు బాగుంటాయి! కానీ, నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఈ పరిస్థితులు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల అకడమిక్ ఇయర్ అంతా కూడా తరగతుల నుంచి హాస్టల్‌కు వెళ్లడం, తినడం, పడుకోవడమే అవుతోంది. వారికి ఆటాపాటలు ఉండటం లేదు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. క్రీడలు, వ్యాయామశాలలు, ఇతర మానసిక ఉల్లాసం కలిగించే కార్యక్రమాలు నామమాత్రంగానే ఉన్నాయి. నిరుడు విద్యార్థులు ఆందోళన చేసినప్పటి నుంచి వారిపై ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి. ఇవి కూడా కొంత వరకు ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు 23వ తేదీన రాథోడ్ సురేశ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి అనారోగ్య సమస్యలను పేర్కొంటూ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గత డిసెంబరు 18న భానుప్రసాద్ అనే మరో విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భాను ఆత్మహత్యకు కారణాలేమిటనేది తెలియలేదు. ఇక ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే జూన్ 14న వడ్ల దీపిక అనే పీయూసీ-1 విద్యార్థి పరీక్ష గదికి ఫోన్ తెచ్చిందనే కారణంగా అధికారులు మందలించడంతో బాత్‌రూం కిటికీకి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలోనే ఆమె మధ్యలో బాత్‌రూంకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే అంటే, జూన్ 15న బుర్ర లిఖిత అనే పీయూసీ-1 విద్యార్థి హాస్టల్ భవనం నాలుగో అంతస్తుపై నుంచి పడి మృతి చెందింది. ఇది ప్రమాదవశాత్తు సంభవించిందని అధికారులు చెప్పినప్పటికీ.. అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా జాదవ్ బబ్లూ అనే పీయూసీ-1 విద్యార్థి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట ముందు తండ్రితో ఫోన్‌లో మాట్లాడిన జాదవ్ బబ్లూ అఘాయిత్యానికి పాల్పడటానికి కారణలేమిటో ఇప్పటివరకు తెలియరాలేదు. గత ఏడాది నుంచి ఐదు ఘటనలు జరిగితే అన్ని మరణాలు మిస్టరీగానే మిగిలాయి. క్యాంప్‌సలో అడుగడుగునా ఆంక్షలు అమలవుతున్నాయి. మీడియాను లోపలికి అనుమతించడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా స్వేచ్ఛగా హాస్టల్, తరగతి గదులను పరిశీలించే పరిస్థితి లేదు. విద్యార్థుల మరణాల వెనుక కారణాలు పరిశీలిస్తే నిర్బంధ పరిస్థితులకు తోడు చదువుపరమైన ఒత్తిడి, వ్యక్తిగత, అనారోగ్య సమస్యలతోపాటు ప్రేమ వ్యవహారాల వంటి వల్ల ప్రాణాలు పోగుట్టుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
వార్డెన్‌ల కొరత.. పర్యవేక్షణ శూన్యం
బాసర ట్రిపుల్ ఐటీలో 9వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పూర్తి స్థాయిలో రెసిడెన్షియల్ క్యాంపస్ కావడంతో హాస్టళ్లలో వార్డెన్ల కొరత తీవ్రంగా ఉంది. 9 వేల మంది విద్యార్థుల్లో 5 వేలకు పైగా విద్యార్థినులున్నారు. విద్యార్థినుల హాస్టళ్లలో నలుగురు మాత్రమే వార్డెన్‌లు (కేర్ టేకర్‌లు) ఉన్నారు. బాలుర వసతి గృహాల్లోనైతే అసలు వార్డెన్‌లే లేరు. సెక్యూరిటీ సిబ్బందే అన్నీ చూసుకుంటారు. ప్రవేశద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది కాపలా ఉంటారు. ఇక భవనాల్లో విద్యార్థులు ఏం చేస్తున్నారు.!? ఎలా ఉన్నారు!? అనే విషయాలను చూసే వారే లేరు. కీలక అధికారులు అడపాదడపా తరగతి గదులకు వెళతారే తప్ప.. హాస్టళ్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. మొత్తమ్మీద హాస్టళ్లలో పర్యవేక్షణ శూన్యం అనే చెప్పవచ్చు. పర్యవేక్షణ పక్కాగా ఉంటే ఆత్మహత్యలను నివారించవచ్చుననే అభిప్రాయాలున్నాయి. క్యాంప్‌సలో ఆత్మహత్య ఘటన జరిగినప్పుడు హడావుడి చేస్తున్నారు తప్ప ఆత్మహత్యలు జరగకుండా ముందస్తు చర్యలు కరువవుతున్నాయి. మంత్రులు కేటీఆర్, సబిత రెండుసార్లు క్యాంప స్‌కు వచ్చినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేదు.
యాప్ డేటా ఆధారంగా మానసిక స్థితిపై అంచనా
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యల నేపథ్యం అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థుల మానసిక స్థితి, ఆరోగ్య సంరక్షణ గురించి అధ్యాయనం చేసే యాప్‌పై వైస్ చాన్స్‌లర్ వెంకటరమణ గురువారం యూనివర్సిటీలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆర్టిపిషియల్ ఇంటలిజెన్స్ విధానం ద్వారా పని చేసే ఈ యాప్ గురించి అధికారులకు అమెరికాకు చెందిన ప్రముఖ ప్రొఫెసర్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ మైక్ ఆన్‌లైన్‌లో అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల మానసిక పరిస్థితిని కనిపెట్టవచ్చునని వివరించారు. యాప్ ద్వారా వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత నిపుణుల విశ్లేషణ అనంతరం డాటా ఆధారంగా విద్యార్థుల మానసిక స్థితిని అంచనా వేయచ్చని వివరించారు. యాప్‌లో 17 ప్రశ్నలు ఉంటాయని, వాటి సమాధానాల ఆధారంగా మానసిక స్థితిని అంచనా వేసి, తర్వాత చికిత్స చర్యలు చేపట్టవచ్చునని డాక్టర్ మైక్ ఆన్‌లైన్‌లో అధికారులకు వివరించారు.
Updated Date - 2023-08-11T11:36:12+05:30 IST