Education: అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు.. పట్టించుకునే నాథుడే లేరా?
ABN , First Publish Date - 2023-07-21T12:52:39+05:30 IST
హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్లు లేరు. ఒక్కో టీచర్ ఐదారు సబ్జెక్టులు బోధిస్తున్నారు. భాషా పండితులు, పీఈటీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలా సబ్జెక్ట్‌లకు టీచర్లు లేక ఏటా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోతోంది. షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తికాకపోవడంతో అత్తెసరు ఫలితాలే వస్తున్నాయి.
ఏళ్ల తరబడి భర్తీ లేని టీచర్ పోస్టులు
వలంటీర్ల తొలగింపుతో ఇబ్బందులు
హైదరాబాద్ సిటీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జిల్లా పరిధిలోని చాలా స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకనుగుణంగా టీచర్లు లేరు. ఒక్కో టీచర్ ఐదారు సబ్జెక్టులు బోధిస్తున్నారు. భాషా పండితులు, పీఈటీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలా సబ్జెక్ట్‌లకు టీచర్లు లేక ఏటా పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోతోంది. షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తికాకపోవడంతో అత్తెసరు ఫలితాలే వస్తున్నాయి.
పేరు గొప్ప..
జిల్లాలోని 16 మండలాల పరిధిలో 182 ఉన్నత, 509 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1,14,607 మంది విద్యార్థులు చదువుతుండగా.. వారికి 6,802 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ప్రధానంగా సబ్జెక్ట్ టీచర్ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం కొత్త పోస్టులను భర్తీ చేయకపోవడంతో పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు సర్కార్ విద్య క్రమంగా దూరమవుతోంది. ప్రస్తుతం జిల్లాలోని తెలుగు, హిందీ, ఉర్దూ మీడియంలో 407 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యావలంటీర్ల తొలగింపుతో అవస్థలు
కరోనాకు ముందు జిల్లావ్యాప్తంగా 480 మంది విద్యా వలంటీర్లు పనిచేశారు. ప్రధానంగా సింగిల్ టీచర్, జీరో టీచర్ స్కూళ్లలో పాఠాలు బోధించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతబడ్డాయి. దీంతో ప్రభుత్వం కూడా విద్యావలంటీర్లను విధుల నుంచి తొలగించింది. అప్పటి నుంచి వలంటీర్లు పడరాని పాట్లు పడుతున్నారు. వలంటీర్లు లేకపోవడంతో బోధన కుంటుపడుతోందని టీచర్లు సైతం పేర్కొంటున్నారు.
విద్యార్థులు ఎక్కువ.. టీచర్లు తక్కువ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సమస్య కొంతకాలంగా వేధిస్తోంది. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా తగినంతమంది టీచర్లు లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. ప్రధానంగా 1 నుంచి 5 వ తరగతి వరకు నడిచే జీరో, సింగిల్ టీచర్ స్కూళ్లలో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటేషన్లకు ఇతర పాఠశాలల నుంచి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో బోధన, పరీక్షల నిర్వహణ పనులన్నీ భారంగా మారుతున్నాయని వారు వాపోతున్నారు. జీరో, సింగిల్ టీచర్ స్కూళ్లతోపాటు హైస్కూళ్లలో కూడా చదువులు ఆగమవుతున్నాయని, ప్రభుత్వం కొత్తగా ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడంతో తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో బోధించే టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. సబ్జెక్ట్ టీచర్ల కొరత కారణంగా ఏటా పదో తరగతి వార్షిక పరీక్షల్లో హైదరాబాద్ జిల్లాలో ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోతోంది.