Evening class: ఆ మూడు తరగతులకు ‘ఈవినింగ్ క్లాస్’
ABN , First Publish Date - 2023-06-28T12:16:05+05:30 IST
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ముఖ్యం
- పాఠశాల విద్యాశాఖ వెల్లడి
అడయార్(చెన్నై): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. ముఖ్యంగా 10, 11, 12 తరగతుల విద్యార్థులకు ఈ స్పెషల్ క్లాస్‌లను నిర్వహించాలని స్పష్టం చేసింది. జిల్లా విద్యాశాఖాధికారుల (డీఈవో)తో రెండు రోజుల విస్తృతస్థాయి సమావేశం మంగళవారం నగరంలో ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న అనేకమంది డీఈవో(DEO)లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుతో పాటు ఉత్తీర్ణతా శాతం పెంపుదల, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల రూపకల్పన తదితర అంశాలపై అభిప్రాయాలను, సూచనలను వెల్లడించారు. పలువురు డీఈవోలు మాట్లాడుతూ... 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులకు సాయంత్రం వేళల్లో విధిగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. దీనికి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు సమ్మతం తెలిపారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో పంపిణీ చేసే మధ్యాహ్న భోజనాన్ని అనేక మంది ప్లస్‌టూ విద్యార్థులు ఆరగించడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో టెన్త్ వరకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. అయితే, ఈ పథకాన్ని 12వ తరగతి వరకు నిర్బంధంగా అమలు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు. అన్నిటికంటే ప్రధానంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలో పారిశుధ్య కార్మికులు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలకు సెక్యూరిటీ సిబ్బందితో పాటు పారిశుద్య కార్మికులను కూడా నియమించాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే, 10, 11, 12 తరగతులకు సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్న అంశంపై విద్యాశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. డీఈవోల విస్తృత స్థాయి సమావేశం తర్వాత వారి సూచనలు, సలహాలు స్వీకరించి, విధి విధానాలను రూపొందించి, ఆ తర్వాతే ప్రకటన చేసే అవకాశం ఉంది.