Professor posts: ఇప్పట్లో భర్తీ లేనట్టేనా?

ABN , First Publish Date - 2023-04-13T11:08:21+05:30 IST

రాష్ట్రం (Telangana)లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Professor posts) భర్తీ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు

Professor posts: ఇప్పట్లో భర్తీ లేనట్టేనా?
Professor posts

వర్సిటీల్లో ప్రొఫెసర్ల భర్తీ ఇప్పట్లో కష్టమే!

రాష్ట్రపతి పరిశీలనకు నియామక బోర్డు బిల్లు

ఆమోదిస్తేనే పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana)లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Professor posts) భర్తీ ప్రక్రియ ఇప్పట్లో ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ‘ప్రొఫెసర్ల నియామక బోర్డు’ బిల్లును గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపించడంతో ఈ అంశంపై రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకొనే అవకాశం లేకుండా పోయింది. బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే గానీ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదని పేర్కొంటున్నారు. తెలంగాణ లోని 11 వర్సిటీల్లో 2 వేలకు పైగా ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు సిబ్బందితో బోధన కొనసాగిస్తున్నారు. గతంలో 1,061 ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి 2017లో జీవో నంబరు 34ను జారీ చేశారు. ఈ నియామకాలను ఇప్పటికీ చేపట్టలేదు. ప్రొఫెసర్ల నియామకంలో ప్రమాణాలను పెంచడానికి 2018లో యూజీసీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీని చేపట్టాలంటే ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల చట్టంలో మార్పులను తీసుకురావాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం కోసం కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టును నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం కామన్‌ బోర్డును ఏర్పాటు చేసింది. ఈ మేరకు యూనివర్సిటీల చట్టానికి సవరణ చేస్తూ ప్రత్యేక బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. గవర్నర్‌ ఈ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు.

os.jpg

Updated Date - 2023-04-13T11:08:21+05:30 IST