Gurukula Board: పరీక్ష నిర్వహణపై గురుకుల నియామక బోర్డు మల్లగుల్లాలు
ABN , First Publish Date - 2023-07-03T11:46:09+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో పోస్టుల భర్తీ కోసం పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించినా.. పలు అంశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఆగష్టు 1 నుంచి 22వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(ట్రిబ్).. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు(సీబీటీ) ఉంటాయని పేర్కొంది.
9,210 పోస్టులకు 2.63 లక్షల దరఖాస్తులు
కంప్యూటర్ ఆధారిత పరీక్షకు బోర్డు సన్నాహాలు
ఆన్‌లైన్ సౌకర్యాలు ఉన్న కేంద్రాల కోసం అన్వేషణ
ఒక్క సారి 40 వేల మంది మాత్రమే పాల్గొనే చాన్స్
ఎన్ని సెషన్లలో నిర్వహించాలన్న దానిపై మల్లగుల్లాలు
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో పోస్టుల భర్తీ కోసం పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించినా.. పలు అంశాలపై సందిగ్ధత వీడడం లేదు. ఆగష్టు 1 నుంచి 22వరకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు(ట్రిబ్).. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షలు(సీబీటీ) ఉంటాయని పేర్కొంది. అయితే, అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లోని 9,210 పోస్టులకు 2.63లక్షల దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్షల నిర్వహణపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌తో పాటు పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా సౌకర్యాలున్న కేంద్రాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహణకు అనువుగా ఉన్న కేంద్రాలను గుర్తించడం అధికారులకు పెద్ద ‘పరీక్ష’గా మారింది. ఈ నేపథ్యంలోనే పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆన్‌లైన్ సౌకర్యం కలిగి ఉన్న కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? వాటిలో కంప్యూటర్ల పరిస్థితి ఏంటి? అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 40వేల మంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గురుకుల పరీక్షలను సెషన్ల వారీగా విభజించి నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయా సబ్జెక్టుల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలన్నింటిని పరిశీలించిన తరువాత ఒక్కో సెషన్‌కు ఎంత మందితో పరీక్ష నిర్వహించాలనే వివరాలు తేలనున్నాయి. మరోవైపు, పరీక్ష మధ్యలో కంప్యూటర్లు మొరాయిస్తే పరిస్థితి ఏంటి? ఏం చేయాలన్న దానిపైనా అధికారులు ఆలోచన చేస్తున్నారు.
సెషన్ల కుదింపుతో ఇబ్బందులే
కొన్నేళ్ల తర్వాత గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పరీక్షలను మాత్రం బోర్డు హడావుడిగా నిర్వహిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గురుకుల పోస్టుల కేటగిరీ, సబ్జెక్టుల వారీగా చూస్తే 170 నుంచి 180 సెషన్లలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కానీ, ట్రిబ్ మాత్రం 54 సెషన్లలోనే పరీక్షలను ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కానీ, పరీక్షల నిర్వహణ సెషన్స్‌ను కుదించడంతో అభ్యర్థులపై ఒత్తిడి పెరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. పేపర్2ను ముందు నిర్వహించి, తర్వాత పేపర్1 నిర్వహిస్తామని ప్రకటించడాన్ని అభ్యర్థులు తప్పుపడుతున్నారు. పేపర్1లో జనరల్ స్టడీస్.. డీఎల్, జేఎల్, పీజీటీ పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది. అన్నింటికీ కలిపి ఒకే పరీక్ష ఎలా నిర్వహిస్తారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గురుకుల పరీక్షల షెడ్యూల్ కూడా గందరగోళంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. సబ్జెక్టుల వారీగా మూడు షిప్టుల్లో మూడు పేపర్లను నిర్వహించేలా చర్యలు తీసుకుంటే.. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.