సీట్లు ఉన్న విద్యార్థులు లేరు! కాలేజీల్లో విచిత్ర పరిస్థితి!

ABN , First Publish Date - 2023-05-15T11:45:41+05:30 IST

రాష్ట్రంలోని డిగ్రీ సీట్ల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య కంటే.. సీట్లే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రతీ ఏడాది

సీట్లు ఉన్న విద్యార్థులు లేరు! కాలేజీల్లో విచిత్ర పరిస్థితి!
Telangana

రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో విచిత్ర పరిస్థితి

ఏటా సగం సీట్లు ఖాళీయే.. ఈసారి భారీగా కోతపడే అవకాశం

కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని డిగ్రీ సీట్ల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్య కంటే.. సీట్లే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ప్రతీ ఏడాది సగం సీట్లు కూడా భర్తీ కావట్లేదు. కొన్ని కాలేజీల్లో అయితే కోర్సుల నిర్వహణకు అవసరమైన విద్యార్థుల సంఖ్య కూడా ఉండట్లేదు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది భారీగా సీట్లను తగ్గించారు. అలాగే విద్యార్థులను ఆకర్షించడానికి వీలుగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

పాసైంది 67 శాతమే..

ఇక ఈ ఏడాది 3,80,920 మంది ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులు వార్షిక పరీక్షలను రాశారు. ఇందులో 67 శాతం మంది అంటే.. 2,56,241 మంది మాత్రమే ఉత్తీర్ణతను సాధించారు. వీరు కాకుండా మరో 28 వేల మంది ఒకేషనల్‌ విద్యార్థులు పాసయ్యారు. మరోవైపు రాష్ట్రంలో 4 లక్షలకు పైగా డిగ్రీ సీట్లున్నాయి. వీటిని తగ్గించి ప్రస్తుతం 3.86 లక్షలకు పరిమితం చేశారు. అయినప్పటికీ ఇంటర్‌ పాసైన విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగానే డిగ్రీ సీట్లున్నాయి. సాధారణంగా ఇంటర్‌ చదివిన విద్యార్థుల్లో కొందరు జేఈఈ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్‌ కోర్సులకు వెళ్తుంటారు. ఎంసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ బీఎస్సీ వంటి కోర్సులతో పాటు, నీట్‌ ద్వారా మెడికల్‌ (ఎంబీబీఎస్‌) వంటి కోర్సుల్లో చేరుతుంటారు. ఇలా సుమారు లక్ష మంది దాకా ఈ కోర్సుల్లో చేరుతున్నారు. ఇక మిగిలిన వారిలో ఎక్కువగా డిగ్రీ కోర్సుల్లో చేరతారు. దీంతో డిగ్రీ సీట్ల కంటే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది.

డిగ్రీలో డేటా సైన్స్‌

ఇప్పటికే అడ్మిషన్లకు సంబంధించి దోస్త్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే డిగ్రీ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడానికి వీలుగా, పలు కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పేరిట నాలుగేళ్ల ఆనర్‌ డిగ్రీ కోర్సును ప్రవేశపెడుతున్నారు. ఈ డిగ్రీ చేస్తే.. దాదాపు ఇంజనీరింగ్‌ చదివినట్టేనని అధికారులు చెప్తున్నారు. తద్వారా ఇంజనీరింగ్‌కు వెళ్లే వారిలో కొంతమందిని డిగ్రీలోకి తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే.. ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో బకెట్‌ సిస్టంను కూడా ప్రవేశపెట్టారు. అంటే.. ఒక ప్రధాన కోర్సు చేస్తూ, మరో కోర్సులోని కొన్ని సబ్జెక్టులను చదివేందుకు అవకాశమిస్తున్నారు. ఇటు డేటాసైన్స్‌ కోర్సులను కూడా ప్రారంభించారు. ఇలా రెగ్యులర్‌ కోర్సులతో పాటు, కొత్త కోర్సుల ద్వారా డిగ్రీ చదువు పట్ల విద్యార్థుల్లో కొంత ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారు.

Updated Date - 2023-05-15T11:45:41+05:30 IST