TS: ఎంసెట్‌ పరీక్షపై ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-05-03T11:26:22+05:30 IST

రాష్ట్రం (Telangana)లో త్వరలో జరగనున్న ఎంసెట్‌ ప్రవేశ పరీక్షా (EMSET ) కేంద్రాల్లో సిటింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు

TS: ఎంసెట్‌ పరీక్షపై ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం
ఎంసెట్‌ పరీక్ష

ఎంసెట్‌ కేంద్రాల్లో సిటింగ్‌ స్క్వాడ్‌!

ఈ ఏడాది కొత్తగా అమలు

పేపర్‌ లీకేజీల నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం (Telangana)లో త్వరలో జరగనున్న ఎంసెట్‌ ప్రవేశ పరీక్షా (EMSET ) కేంద్రాల్లో సిటింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వరసగా పేపర్‌ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఈ సారి సిటింగ్‌ స్క్వాడ్‌ (Sitting squad) విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సిటింగ్‌ స్క్వాడ్‌ను నియమించనున్నారు. ఈ స్క్వాడ్‌.. పరీక్ష పూర్తయ్యే వరకు ఉండి, నిర్వహణను పర్యవేక్షించనుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా పరీక్షల కేంద్రాలపై గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద నలుగురు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇక సెల్‌ఫోన్లను పూర్తిస్థాయిలో నిషేధించారు. ఇన్విజిలేటర్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది సహా అందరికీ ఈ నిబంధన వర్తించనుంది. ఒక్క అబ్జర్వర్‌ ను మాత్రమే సెల్‌ఫోన్‌తో అనుమతించినా పరీ క్షా హాల్లోకి ఫోన్‌ తీసుకెళ్లడానికి వారినీ అనుమతించరు. పరీక్ష మొదలైన 15 నిమిషాల వరకే సెల్‌ఫోన్‌ వాడేందుకు అనుమతిస్తారు. అదీ పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారన్న సమాచారాన్ని చేరవేసేందుకు మాత్రమే. ఎంసెట్‌తో పాటు ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌లన్నింటికీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. విద్యార్థుల కోసం హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఇబ్బందులుంటే డెస్క్‌ల దృష్టికి తీసుకెళ్తే అధికారులు చర్యలు తీసుకుంటారు.

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

తెలంగాణ ఎంసెట్‌ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబా ద్రి తెలిపారు. ఇప్పటికే 2.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. భారీగా దరఖాస్తులొచ్చిన నేపథ్యంలో కొత్తగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎంసెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు.

కొత్తగా బయోటెక్నాలజీ కోర్సు!

ఈ ఏడాది కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో 60 సీట్లతో కోర్సును ప్రవేశపెట్టనున్నారు.

Updated Date - 2023-05-03T11:28:10+05:30 IST