Education: పుస్తకాలూ లేవు.. లెక్చరర్లూ లేరు! ఇంటర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి!

ABN , First Publish Date - 2023-07-06T14:16:46+05:30 IST

రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ తరగతులు మొదలై నెలరోజులైంది. కానీ నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. బోధించేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. అటు ప్రైవేటు కళాశాలల్లో విద్యాబోధన వేగం పుంజుకోగా.. ప్రభుత్వ ఇంటర్‌ విద్యార్థులు మాత్రం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జూనియర్‌, మోడల్‌, కేజీబీవీ, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.

Education: పుస్తకాలూ లేవు.. లెక్చరర్లూ లేరు! ఇంటర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి!

ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి

తరగతులు పారంభవ్వడంతో ఇబ్బందులు

ఉచిత పుస్తకాలకు మరికొంత సమయం

గెస్ట్‌ లెక్చరర్ల నియామకం ఎప్పుడో..!

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ తరగతులు మొదలై నెలరోజులైంది. కానీ నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. బోధించేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. అటు ప్రైవేటు కళాశాలల్లో విద్యాబోధన వేగం పుంజుకోగా.. ప్రభుత్వ ఇంటర్‌ విద్యార్థులు మాత్రం దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ జూనియర్‌, మోడల్‌, కేజీబీవీ, గురుకుల జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం సుమారు రూ. 25 కోట్లను సర్కారు వెచ్చిస్తోంది. పుస్తకాల ముద్రణ బాధ్యతను తెలుగు అకాడమీ చూసుకుంటోంది. ఈ ఏడాది ఈ పుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ముద్రణకు అవసరమైన కాగితాన్ని సమకూర్చుకోవడంలో జాప్యం కారణంగా ఈ ఆలస్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్‌ కోర్సును అభ్యసిస్తున్నారు. ఇందులో 1.9 లక్షల మంది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో, లక్ష మంది విద్యార్థులు వివిధ రెసిడెన్షియల్‌ కాలేజీల్లో చదువుతున్నారు. మిగిలిన 6.5 లక్షలకు పైచిలుకు విద్యార్థులు ప్రైవేట్‌ కాలేజీల్లో చదువుతున్నారు. ప్రైవేటు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇప్పటికే వారికి సమకూరాయి. బయటి మార్కెట్‌, తెలుగు అకాడమీల నుంచే ఈ పుస్తకాలను సేకరించడం గమనార్హం.

కొనసాగుతున్న లెక్చరర్ల కొరత

పుస్తకాలతో పాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్ల కొరత కూడా తీవ్రస్థాయిలోనే ఉంది. దీన్ని పరిష్కరించేందుకు ప్రతి ఏడాది సుమారు 2వేలమంది గెస్ట్‌ లెక్చరర్లను నియమిస్తున్నారు. అయితే... ఈ ఏడాది గెస్ట్‌ లెక్చరర్ల నియామకం ఇంకా జరగలేదు. దాంతో విద్యాబోధనకు సరైన లెక్చరర్లు లేరు. చదువుకోవడానికి పుస్తకాలు లేక, చెప్పడానికి లెక్చరర్లూ లేక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విచిత్ర పరిస్థితి ఏర్పడింది. గత నెల ఒకటో తేదీన ఇంటర్మీడియట్‌ తరగతుల్ని ప్రారంభించిన అధికారులు, ఈ ఏడాది సిలబ్‌సను త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అటు ప్రైవేటులో వేగంగా బోధన జరుగుతున్న నేపథ్యంలో.. పరీక్షల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, ప్రైవేటు విద్యార్థులతో పరీక్షల్లో ఎలా పోటీ పడతారంటూ పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అటు పాఠశాలల్లోనూ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి స్థాయిలో జరగకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 29 లక్షల మంది విద్యార్థులకు సుమారు 1.57 కోట్ల పాఠ్య పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉంది. అయితే... సాంకేతిక కారణాలతో ఇంకా కొన్ని స్కూళ్ల పరిధిలోని విద్యార్థులకు ఈ పుస్తకాలు చేరలేదని సమాచారం. సుమారు 5 నుంచి 10 శాతం విద్యార్థులకు ఈ పుస్తకాలు అందలేదని చెబుతున్నారు.

Updated Date - 2023-07-06T14:16:46+05:30 IST