Education: గెస్ట్ లెక్చరర్లు ఔట్!
ABN , First Publish Date - 2023-07-19T12:38:22+05:30 IST
రాష్ట్రంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల్లో పని చేస్తున్న వారిని రెన్యువల్ చేయకుండా, కొత్తగా నియామకాలు జరపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ నిర్ణయించారు. ఈ మేరకు నియామక షెడ్యూల్‌ను ప్రకటించారు.
రెన్యువల్‌ను పక్కన పెట్టాలని కమిషనర్ నిర్ణయం
పదేళ్లుగా పని చేస్తున్న 1,654 మందిపై శరాఘాతం
హైదరాబాద్, జులై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల్లో పని చేస్తున్న వారిని రెన్యువల్ చేయకుండా, కొత్తగా నియామకాలు జరపాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ నిర్ణయించారు. ఈ మేరకు నియామక షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ నెల 19న నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 1వ తేదీ నాటికి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనిపై, గత 10 సంవత్సరాలుగా గెస్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న దాదాపు 1,654 మంది తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఏడాది విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే నాటికి వీరిని అధికారులు రెన్యూవల్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా తమను రెన్యూవల్ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే.. అందుకు భిన్నంగా ఈసారి పోస్టుల భర్తీకి కొత్తగా దరఖాస్తులను స్వీకరించాలని కమిషనర్ నిర్ణయించారు. ఆయా కాలేజీల్లో ఉన్న గెస్ట్ లెక్చరర్ల ఖాళీ పోస్టులకు సంబంధించిన జాబితాను జిల్లాల వారీగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తుల నుంచి ఓక్కో పోస్టుకు ముగ్గురి (1:3 నిష్పత్తి) చొప్పున మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందించాలని సూచించారు.
గెస్ట్ లెక్చరర్ల సంఘం ఆందోళన
కమిషనర్ నిర్ణయంతో వేలాది కుటుంబాలు రోడ్లపై పడతాయని గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 9, 10 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమని కాదని, కొత్తవారిని తీసుకోవాలని నిర్ణయించడం సమంజసం కాదన్నారు. నియామక షెడ్యూల్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం మంత్రి సబితకు వినతి పత్రం అందజేశారు.
తొలగింపు అన్యాయం: మధుసూదన్‌రెడ్డి
గత పదేళ్లుగా పనిచేస్తున్న వారిని ఒక్క కలంపోటుతో తొలగించడం అన్యాయమని ఇంటర్ విద్యా జాక్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి అన్నారు. గెస్ట్ లెక్చరర్ల నియామకంలో ఈ ఏడాది ఇప్పటికే తీవ్ర ఆలస్యం అయిందని, దీని ప్రభావం అడ్మిషన్లపై పడిందని చెప్పారు.