ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TET Special: తక్కువ సమయంలో టెట్‌లో మార్కులు సాధించాలంటే..!

ABN, First Publish Date - 2023-08-14T14:19:04+05:30

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15న టెట్‌ పరీక్ష జరుగుతుంది. అదే నెల 27న ఫలితాలు ప్రకటిస్తారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1న టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సెప్టెంబరు 15న టెట్‌ పరీక్ష జరుగుతుంది. అదే నెల 27న ఫలితాలు ప్రకటిస్తారు. ఈసారి ప్రక్రియ అంతా వేగంగా జరగనున్నది. నోటిఫికేషన్‌కు పరీక్షకు మధ్య నెలన్నర సమయం మాత్రమే ఉంది. అందువల్ల అభ్యర్థులు సిలబస్‌ మీద సంపూర్ణమైన అవగాహనతో, పక్కా ప్రణాళికతో పరీక్షకు సిద్ధం కావాలి.

విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు టెట్‌(స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలంటే పేపర్‌-1లో, 6 నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే పేపర్‌-2లో అర్హత సాధించాలి. టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే టీఆర్‌టీ(టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌) రాయడానికి అర్హులు. టెట్‌లో సాధించిన మార్కులకు టీఆర్‌టీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి టీఆర్‌టీలో ఎంపిక కావడంలో టెట్‌లో వచ్చిన మార్కులు కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల కేవలం టెట్‌లో అర్హత సాధించడానికి పరిమితం కారాదు. అధిక మార్కులు పొందడానికి ప్రయత్నం చేయాలి.

టెట్‌కు సంబంధించి రెండు పేపర్లలోను కామన్‌గా ఉండే లాంగ్వేజ్‌-1లో తెలుగు ఐచ్ఛికం చాలా కీలకమైంది. మొత్తం 150 మార్కుల టెట్‌ ప్రశ్న పత్రంలో తెలుగుకు 30 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, పదజాలం, వ్యాకరణం, బోధన పద్ధతులు, నిరంతర సమగ్ర మూల్యాంకనం అనే అంశాలను అవగాహనతో ప్రణాళికాబద్ధంగా చదివితే 30కి 30 మార్కులు సాధించడం సులువే. ఒకే రకమైన సిలబ్‌సను ఇవ్వడం వల్ల రెండు పేపర్ల తెలుగు ప్రిపరేషన్‌ ఒకేసారి పూర్తి చేయవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో తయారు చేసిన 1 నుంచి 10వ తరగతి వరకు గల తెలుగు పాఠ్యపుస్తకాల్లోని అంశాల వారీగా క్షుణ్ణంగా చదవాలి.

పఠనావగాహన

పద్యం, గేయం, వచన కవిత, గద్యం తదితర అంశాల్లో అభ్యర్థి పఠనావగాహనను, ప్రతిస్పందన నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. కార్యకారణ సంబంధాన్ని ప్రతిబింబించే విధంగా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ప్రశ్నపత్రంలోని పద్యం/గద్యం అవగాహనతో చదివితే ఈ ప్రశ్నలకు తేలికగా జవాబులు గుర్తించవచ్చు. గతంలో నిర్వహించిన టెట్‌ ప్రశ్న పత్రాల్లోని పద్య, గద్యాలను, ప్రశ్నల స్వభావాన్ని పరిశీలించాలి. పాఠ్యపుస్తకాల్లోని కొన్ని పద్య, గద్యాలు చదివి ప్రశ్నలు తయారు చేయడం ద్వారా పఠనావగాహన పెరుగుతుంది.

తెలంగాణ ప్రాచీన, ఆధునిక సాహిత్యం, సంస్కృతి

విషయ జ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఈ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. కనుక విషయ ప్రధానంగా సిద్ధం కావాలి. తెలుగు పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను తెలంగాణ కవులు/రచయితలు, సాహిత్య ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు,క్రీడలు, పాటలు మొదలైన అంశాల వారీగా విభజించుకుని చదవాలి. పాఠ్యపుస్తకంలోని అన్ని పాఠాల జాబితాను ఒక పట్టిక రూపంలో రాసుకోవాలి. కవి/రచయిత పేరు, అతని రచనలు, బిరుదులు/పురస్కారాలు, రచనాశైలి, ప్రక్రియ పేరు, పాఠంలోని కీలక భావనలు ఆ పట్టికలో రాసుకోవాలి. పాఠ్య పుస్తకాల్లో లేని కవులు/రచయితల గురించి విడిగా చదవాలి. తెలుగు సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర గ్రంథాలు దీనికి ఉపకరిస్తాయి.

పదజాలం

తెలంగాణ పదజాలం, అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రకృతి-వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు మొదలైన పదజాలాభ్యసన సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలు వస్తాయి. ప్రతి తరగతికి చెందిన పాఠ్యపుస్తకం చివర పదవిజ్ఞానం ఇచ్చారు. అన్ని తరగతుల పద విజ్ఞానం పేజీలను ఒకే చోట చేర్చుకుని తెలంగాణ పదజాలం, అర్థాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రకృతి-వికృతులు చదివితే పదజాలంపై సంపూర్ణమైన అవగాహన కలుగుతుంది. సంబంఽధిత పాఠాల్లో ఉన్న తెలంగాణ పదజాలం, వాటి అర్థాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. పాఠ్యపుస్తకాల్లో ఉన్న జాతీయాలు, సామెతలు, పొడుపు కథలను ప్రత్యేకంగా నోట్‌ పుస్తకంలో రాసుకోవాలి.

భాషాంశాలు

పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు, అనునాసికాలు, ఊష్మాలు, ద్విత్వ; సంయుక్త; సంశ్లేష అక్షరాలు- వాక్యాలు, భాషాభాగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు-ప్రత్యయాలు, విరామచిహ్నాలు, సమాపక, అసమాపక క్రియలు, ఆశ్చర్యార్థక; విధ్యర్థక; ప్రశ్నార్థక; సందేహార్థక; అనుమత్యర్థక; నిషేధార్థక తదితర వాక్య భేదాలు, ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మణి వాక్యాలు, అర్థవిపరిణామం, తెలుగు; సంస్కృత సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు మొదలైన వ్యాకరణాంశాలు చదవాలి. ఈ అంశాలన్నింటినీ కలగలపి ఏ తరగతికి ఆ తరగతి పాఠ్యపుస్తకాన్ని చదవకూడదు. పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలను అంశాలవారీగా విభజించుకోవాలి. అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లో ప్రతి పాఠం చివర ఇచ్చిన ‘ఇవి చేయండి’లోని అభ్యాసాల్లో ఉన్న ఒకే విధమైన భాషాంశాలను ఒక చోట చేర్చి, ప్రత్యేకంగా నోట్స్‌ తయారు చేసుకోవాలి. తద్వారా వ్యాకరణాంశాలను లక్షణబద్దంగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రిపరేషన్‌ కూడా తక్కువ సమయంలో పూర్తవుతుంది.

నిరంతర సమగ్ర మూల్యాంకనం

విద్యార్థులు శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆర్‌టిఇ-2009 ప్రకారం ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం’ ప్రవేశపెట్టారు. విద్యార్థుల ప్రగతిని కేవలం యూనిట్‌, టెర్మినల్‌ పరీక్షలకు పరిమితం చేయకుండా వారి అభ్యసనను పాఠశాల లోపల, వెలుపల పరిశీలించడం, అభ్యసన లోపాలను గుర్తించి సవరణలు చేయడం, పాఠ్య, పాఠ్యేతర అంశాలకు సమప్రాధాన్యం ఇవ్వడం నిరంతర సమగ్ర మూల్యాంకనం(సిసిఇ)లోని ప్రధానమైన అంశాలు. టెట్‌ అభ్యర్థులు సి.సి.ఇ. భావనలను, ఆధారాలను, మూల్యాంకన విధానాలను అర్థం చేసుకోవాలి. నిర్మాణాత్మక మూల్యాంకనం, సి.సి.ఇ. రిజిస్టర్లు; రికార్డుల నిర్వహణ, సి.సి.ఇ అమలు సూచికలు అనే అంశాలను కూడా అధ్యయనం చేయాలి. ఉపాధ్యాయ వృత్తిలో చేరే ముందు మూల్యాంకన విధానాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండటం ఈ విభాగం ప్రధాన ఉద్దేశం. దానికనుగుణంగానే పరీక్షల్లో ప్రశ్నల స్వభావం ఉంటుంది.

బోధన పద్ధతులు

అభ్యర్థులు డి.ఎడ్‌/బి.ఎడ్‌ చదివేటప్పుడే సిలబ్‌సలో ఉన్న తెలుగు బోధన పద్ధతులు అధ్యయనం చేసి ఉంటారు. కింది అంశాలను మరొక్కసారి మననం చేసుకుంటే ఈ విభాగంలో మార్కులు సాధించడం సులువు అవుతుంది. భాష, మాతృభాష-బోధన లక్ష్యాలు, భాష-వివిధ భావనలు; స్వభావం, తరగతి గది అన్వయం అనే అధ్యాయాలకు సంబంధించిన కీలక భావనలను నోట్స్‌ రూపంలో తయారు చేసుకుని చదవాలి.

భాషా నైపుణ్యాలు/సాధించాల్సిన సామర్థ్యాలు, అభ్యసన ఫలితాలు, తరగతి గది అన్వయం అనేవి ఆయా తరగతుల స్థాయిని బట్టి ఉంటాయి. ఆయా తరగతులు పూర్తిచేసే నాటికి విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాల గురించి పాఠ్యపుస్తకాల్లో ఇచ్చారు. వాటిని చదవాలి. బోధన పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమాలు, బోధనాభ్యసన ఉపకరణాలు తదితర అంశాలకు సంబంధించిన డి.ఎడ్‌/బి.ఎడ్‌ సిలబ్‌సను పాఠ్యపుస్తకాలతో అనుసంధానించి చదవాలి.

-స్తంభంకాడి గంగాధర్‌, సీనియర్‌ ఫ్యాకల్టీ

Updated Date - 2023-08-14T14:19:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising