ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Education: గిరిజన యూనివర్సిటీకి పచ్చజెండా?

ABN, First Publish Date - 2023-09-29T11:42:46+05:30

గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబరులో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు

  • కదిలిన మంజూరు ఫైలు.. అక్టోబరులో ఉత్తర్వులు..

  • 800 కోట్ల నుంచి 900 కోట్ల దాకా వ్యయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముహూర్తం దాదాపు ఖరారైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబరులో యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ, తెలంగాణల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటుచేయనున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటై తొమ్మిదేళ్లు దాటినా రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు దిశగా అడుగు పడలేదు. ఏపీలో మాత్రం నిరుడే గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రం ప్రారంభించింది. తాజాగా తెలంగాణలోనూ ట్రైబల్‌ వర్శిటీ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంతర్గతంగా కీలక చర్చలు జరుపుతోంది. ఇప్పటికే సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించే పైలును కదిలించిన కేంద్రం, త్వరలో ఎన్నికల నేపథ్యంలో తాజాగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఫైలును తెరమీదకు తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. తెలంగాణలో రాజకీయంగా బలపడాలన్న ఉద్దేశంతో వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ సర్కారు.. తొలుత రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద ఉన్న కీలక అంశాలను పరిష్కరించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు సమ్మక్క-సారక్క జాతర జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అంశాలు ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడతాయనే భావనలో బీజేపీ ఉందని చెబుతున్నారు.

ఇన్నాళ్లూ భూమి కేటాయింపు పైనే పేచీ

గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఇన్నాళ్లూ కేంద్రం-రాష్ట్ర ప్రభుత్వం మధ్య భూ కేటాయింపు అంశమ్మీదే పేచీ నెలకొంది. ఈ విషయంలో చాలా కాలం నుంచి రెండు ప్రభుత్వాల మధ్య వాదోపవాదనలు జరుగుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దాదాపు 500 ఎకరాల స్థలం అవసరం పడుతుందని, ఆ మేరకు భూమిని కేటాయిస్తే మంజూరు చేస్తామంటూ కేంద్రం చెబుతూ వస్తోంది. అయితే ఒకేచోట అంత మొత్తంలో భూమి సమకూర్చలేమని.. కొంత భూమిని ఒకచోట, ఇంకొంత భూమిని మరోచోట కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఒకేచోట భూమిని కేటాయిస్తేనే వర్సిటీ ఓకే చేస్తామని చెబుతూ వస్తున్న కేంద్రం చివరికి మెట్టు దిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా ములుగు జిల్లాలోనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఒకచోట 335 ఎకరాలు.. మరోచోట 165 ఎకరాలు

గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుకు ఓకే చోట 500 ఎకరాలను సమకూర్చే వీలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని కేంద్రానికి సూచించింది. ములుగు- జకారం ప్రాంతంలోని మేడారం జాతర సమీపంలోని గట్టమ్మ గుట్ట వద్ద 335 ఎకరాలను, పసర వద్ద 165 ఎకరాలను ఇస్తామని కేంద్రానికి చెప్పింది. అయితే యూనివర్సిటీ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండాలని, అందుకు అవసరమైన భూమిని ఒకేచోట కేటాయించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఫలితంగా చాలా కాలం నుంచి యూనివర్సిటీ వ్యవహరం నిలిచిపోయింది. మళ్లీ ఇప్పుడు స్పందించిన కేంద్రం ములుగులోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. యూనివర్శిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు రాగానే అక్కడ అవసరమైన కరెంటు, రోడ్లు, నీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. కాగా యూనివర్సిటీ ఏర్పాటు తదితర అంశాల కోసం భూమిని ఖరారు చేసిన రాష్ట్ర సర్కారు, యూనివర్శిటీ భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు క్లాసులు, అడ్మినిస్ట్రేషన్‌ నిర్వహణ కోసం యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (వైటీసీ)ను కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి రాసిన లేఖల్లో స్పష్టం చేసినట్లు సమాచారం.

నిర్మాణానికి రూ.900కోట్లు

రాష్ట్రంలో గిరిజన వర్సిటీ నిర్మాణానికి కేంద్రం సుమారు రూ.800 నుంచి రూ.900 కోట్ల మేర నిధులను వెచ్చించనుంది. ఈ మేరకు భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల పరమైన నిర్మాణాలను విశ్వవిద్యాలయాల నిబంధనల మేరకు నిర్మించనున్నారు. యూనివర్శిటీ ఏర్పాటుతో దాదాపు 500 మేర వివిధ స్థాయిల్లో సిబ్బందిని భర్తీ చేయాల్సి ఉంటుంది. విశ్వ విద్యాలయం మొదటి ఏడాదిని ఆరు కోర్సులతో ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు నేపథ్యంలో సీట్ల కేటాయింపులో కీలకమైన రిజర్వేషన్ల అంశం కూడా తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గిరిజనులకు 7.5శాతం రిజర్వేషన్‌ అమల్లో ఉండగా, తెలంగాణలో 10శాతంగా ఉంది. తెలంగాణలో గతంలో ఉన్న 6శాతాన్ని 10శాతంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. కానీ పార్లమెంటులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. దీంతో దేశంలో 7.5శాతం, రాష్ట్రంలో 10శాతంగా రిజర్వేషన్లు ఉండడంతో దీనిపై సందిగ్ధత ఏర్పడింది. దీనికి పరిష్కారంగా సూపర్‌ న్యూమరరీ విధానంలో గిరిజన విద్యార్ధులకే అధిక సీట్లు కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాగా వర్సిటీలో ప్రత్యేకంగా గిరిజన కళలు, సంస్కృతితో పాటు ఇతర కోర్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Updated Date - 2023-09-29T11:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising