Education: ఇలాగైతే విద్యా బోధన పర్యవేక్షణ ఎలా!
ABN , First Publish Date - 2023-06-14T12:10:43+05:30 IST
లక్షకు పైగా ఉపాధ్యాయులు, సుమారు 26 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాల విద్యా విభాగంలో పర్యవేక్షణ కరువైంది. పాఠశాల విద్య శాఖలో అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. విద్యార్థులకు
టీచర్ నుంచి డీఈవోల వరకు ఖాళీయే
విద్యా బోధన పర్యవేక్షణ ఎలా!
ఏళ్ల తరబడి ఇన్చార్జ్జిలతోనే కొనసాగింపు
జిల్లాలోని అన్ని మండలాలకు ఒకే ఎంఈవో!
హైదరాబాద్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): లక్షకు పైగా ఉపాధ్యాయులు, సుమారు 26 లక్షలకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాల విద్యా విభాగంలో పర్యవేక్షణ కరువైంది. పాఠశాల విద్య శాఖలో అన్ని విభాగాల్లో భారీగా ఖాళీలు ఉన్నాయి. విద్యార్థులకు చదువు చెప్పే టీచర్ పోస్టు నుంచి జిల్లాలోని పాఠశాలలను పర్యవేక్షించే డీఈవోల వరకు అన్ని పోస్టుల్లో ఖాళీలే. దాంతో సరైన పర్యవేక్షణ లేక చదువు కుంటుపడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, డీఈవోలు వంటి పోస్టులను ఎక్కువ శాతం ఇన్చార్జిలతోనే నడిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి జిల్లాకు ఒక జిల్లా విద్యా అధికారి (డీఈవో) ఉండాలి. అయితే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో రెగ్యులర్ డీఈవోలు ఏడుగురే ఉన్నారు. జిల్లాల సంఖ్య ఆధారంగా డీఈవో పోస్టులను ఇంకా మంజూరు చేయలేదు. రాష్ట్రంలో రెగ్యులర్ డీఈవో పోస్టులు కేవలం పన్నెండే ఉండగా అందులోనూ ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాంతో ప్రస్తుతం సుమారు 26 జిల్లాల్లో రెగ్యులర్ డీఈవోలు లేరు. అలాగే రాష్ట్రంలో డిప్యూటీ డీఈవో పోస్టులు 66 ఉండగా, 60 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం 6 మంది డిప్యూటీ డీఈవోలే పనిచేస్తున్నారు.
607 మండలాలకు 17 మంది ఎంఈవోలు !
మండల విద్యాధికారుల(ఎంఈవో) పోస్టుల్లో 95 శాతం పైగా ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. మండలానికి ఒక ఎంఈవో ఉండాలి. రాష్ట్రంలో మొత్తం 607 మండలాల ఉన్నాయి. కానీ రాష్ట్రంలో మంజూరైన పోస్టులు 488 ఉన్నాయి. వాటిలో 17 పోస్టుల్లో రెగ్యులర్ ఎంఈవోలు ఉండగా, మిగిలిన వారంతా ఇన్చార్జులే. ప్రధానోపాధ్యాయులను ఎంఈవో ఇన్చార్జులుగా నియమించారు. అందులోనూ ఒక్కో అధికారికి 6, 7 మండలాలను కేటాయించడం గమనార్హం. రాష్ట్రంలో 85 మండల్లాలోనే ఒక మండలానికి ఒక ఎంఈవో(ఇన్ఛార్జి) ఉన్నారు. మిగిలిన పోస్టుల్లో ఒక అధికారికి 7 మండలాలు, మరో 8 మంది అధికారులకు ఒక్కొరికి 5 మండలాల చొప్పున, 24 మంది ఎంఈవోలకు ఒక్కొక్కరికి 4 మండలాల చొప్పున, 59 మంది ఎంఈవోలకు ఒక్కొక్కరికి 3 మండలాల చొప్పున, 87 మందికి ఒక్కొక్కరికి 2 మండలాల చొప్పున ఇన్చార్జులుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. దీన్ని రాష్ట్రంలో ఎంఈవోల పోస్టుల దుస్థితి తెలుస్తోంది. జనగామ జిల్లాలో 12 మండలాలు ఉండగా, వాటన్నిటికీ ఒక్క ఎంఈవోనే ఉన్నారు. ఆయన కూడా ప్రధానోపాధ్యాయుడే కావడం, ఇన్చార్జి ఎంఈవోగా కొనసాగుతుండడం గమనార్హం.
ప్రధానోపాధ్యాయుల పరిస్థితి అంతే..!
మరోవైపు ప్రధానోపాధ్యాయుల పరిస్థితీ అలాగే ఉంది. రాష్ట్రంలో మొత్తం 4,252 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉండగా, వాటిలో 2,270 మంది హెచ్ఎమ్లే పనిచేస్తున్నారు. మరో 1,982 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అలాగే విద్యా బోధన సిబ్బందిని తయారు చేసే డైట్ కాలేజీల్లోనూ అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 10 డైట్ కాలేజీ ప్రిన్సిపాళ్ల పోస్టులు ఉండగా, వాటిలో 6 ఖాళీగానే ఉన్నాయి. 70 సీనియర్ లెక్చరర్ పోస్టులు ఉండగా, అవన్నీ ఖాళీగా ఉన్నాయి. అవుట్ పోర్సింగ్ సిబ్బంది, ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. అలాగే తెలుగు మీడియం లెక్చరర్ల పోస్టులు 166 ఉండగా, వాటిలో 152 పోస్టులు, ఉర్దూ మీడియం లెక్చరర్ల పోస్టులు 40 ఉండగా, వాటిలో 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాల విద్యా విభాగంలో పర్యవేక్షణకు అవసరమైనంత మంది అధికారులు లేకపోవడం వల్ల నాణ్యమైన విద్య అందుబాటులోకి రావడం లేదన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోల పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉండడం వల్ల విద్యార్థులకు తీవ్రంగా నష్ట జరుగుతుందన్న వాదనలు ఉన్నాయి. పాఠశాలలు సవ్యంగా నడవాలన్నా, విద్యార్థులకు సరైన బోధన అందాలన్నా పర్యవేక్షణ వ్యవస్థ అవసరం చాలా ఉంది.