Heart care: కొత్త సంవత్సరంలో ఆనందంగా ఉండేందుకు..!
ABN, First Publish Date - 2023-01-03T10:59:26+05:30
కొన్ని అంచనాలు, ఇంకొన్ని లక్ష్యాలతో కొత్త సంవత్సరం (new year)లోకి అడుగు పెట్టేశాం! వాటిని అందుకోవాలంటే ఆరోగ్యం కూడా నిక్షేపంగా ఉండాలి. అందుకోసం పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు (Principles of health) ఇవే!
హెల్త్ కేర్
కొన్ని అంచనాలు, ఇంకొన్ని లక్ష్యాలతో కొత్త సంవత్సరం (new year)లోకి అడుగు పెట్టేశాం! వాటిని అందుకోవాలంటే ఆరోగ్యం కూడా నిక్షేపంగా ఉండాలి. అందుకోసం పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు (Principles of health) ఇవే!
ఆరోగ్యం మీద తాపత్రయం సర్వత్రా పెరిగింది. వ్యాయామం చేయడం, పోషకాలతో కూడిన ఆహారానికి పెద్ద పీట వేయడం అంతటా చూస్తున్నాం. అయితే వేలిముద్రల్లా (fingerprints) ఏ ఇద్దరి శరీర తత్వాలూ, స్పందించే తీరులూ ఒకేలా ఉండవు. కుటుంబ చరిత్ర, జన్యు నిర్మాణం, జీవనశైలి, పరిసరాలు, ఒత్తిడి... మొదలైన మరెన్నో అంశాలు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటూ తగిన ఆరోగ్య సూత్రాలను ఎంచుకోవాలి. శరీర జీవ వ్యవస్థలన్నీ మెరుగ్గా పనిచేసే జీవన నియమాలను, జాగ్రత్తలను పాటించాలి.
ఉద్యోగావకాశాలు విస్తృతమయ్యాయి. వాటితో పాటే జీతభత్యాలూ పెరిగాయి. వేర్వేరు ఆహార శైలులు కూడా ఊపందుకున్నాయి. అయితే వీటన్నిటితో పాటు అంతే వేగంగా శరీరాలు కూడా కదలాలి. కానీ అలా జరగడం లేదు. ఉద్యోగ వేళలు పెరగడంతో ఇంటి వంటకు సమయం ఉండడం లేదు. దాంతో ఇంటి భోజనాలు అరుదుగా, ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్లు (Food orders) నిరంతరంగా పెరిగిపోతూ ఉంటున్నాయి. ఆ పదార్థాల్లో ఎలాంటి దినుసులు వాడారో, అవి ఎలాంటి పరిసరాల్లో తయారవుతున్నాయో, వాటితో ఎన్ని క్యాలరీలు శరీరాల్లోకి చేరుతున్నాయో తెలియదు. ఇలా ఎక్కువ సమయాల పాటు సెడెంటరీ జీవనశైలిని గడపడం ద్వారా క్యాలరీలు ఖర్చయ్యే అవకాశాలు అడుగంటుతూ, అస్తవ్యస్థ ఆహారశైలుల వల్ల అదనపు క్యాలరీలు తోడవుతున్నాయి. వీటికి తోడు వృత్తిపరమైన లక్ష్యాలను అందుకోవడం కోసం ఒత్తిడిలో పని చేస్తూ ఉంటారు. ఇవన్నీ గుండె జబ్బుల (Heart disease)కు దారి తీసేవే!
హై రిస్క్ గ్రూప్స్ అప్రమత్తంగా...
కుటుంబ చరిత్రలో లేదా తల్లితండ్రులకు గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు రుగ్మతలు కలిగి ఉంటే, వారి పిల్లలు హై రిస్క్ కోవలోకి వస్తారు. వీళ్లకు ప్రిమెచ్యూర్ హార్ట్ ఎటాక్స్, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే, 40 ఏళ్ల లోపే గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు వీళ్లకు ఎక్కువగా ఉంటాయి. ఇలా జన్యుపరంగా తమకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలున్నాయనే అవగాహన అందరికీ ఉండడం లేదు. కానీ ఈ కోవకు చెందిన వాళ్లు ఆయా రుగ్మతలు వచ్చే అవకాశాలు తమకు ఎక్కువగా ఉన్నాయనే అవగాహన కలిగి ఉండి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఏడాదికోసారి ఇసిజితో పాటు టుడిఎకొ, ట్రెడ్‌మిల్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు జనరల్ చెకప్ కూడా చేయించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వైద్యులు రిస్క్ ఫ్యాక్టర్స్‌ను అంచనా వేసి, ముందు జాగ్రత్తగా ప్రివెంటివ్ మెడికేషన్‌తో పాటు తగిన సూచనలు సలహాలు అందిస్తారు. అలాగే జిమ్‌లో వ్యాయామాలు చేయాలనుకునే హై రిస్క్ కోవకు చెందిన వాళ్లు ముందు తమ ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా నిర్ధారించుకుని, తగిన వ్యాయామాలను ఎంచుకోవాలి. వ్యాయామాల తీవ్రతలో ఒక క్రమాన్ని అనుసరించాలి.
నియంత్రణ ఇలా...
రోజులోని 24 గంటల్లో ఒక గంట సమయాన్ని ఎవరికి వారు తమ ఆరోగ్యం కోసం కేటాయించుకోవాలి.
గంటకు మూడు కిలోమీటర్లు నడిస్తే చాలనుకుంటారు. కానీ నడకలో వేగం ముఖ్యం. ఒక కిలోమీటరు దూరం 8 నుంచి 10 నిమిషాల్లో నడవాలి. క్యాలరీలు ఖర్చవ్వాలంటే గుండె వేగం నిమిషానికి 100 నుంచి 120కి పెరగాలి. అలాంటప్పుడే రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగం పెరిగి, ప్లేట్‌లెట్స్ పేరుకుపోకుండా ఉంటాయి.
సెల్ ఫోన్లు జేబులో పెట్టుకుని, స్టెప్ ట్రాకర్‌తో రోజుకు పది వేల అడుగులు నడిచామని మురిసిపోయే వాళ్లూ ఉన్నారు. ఈ అడుగులను వ్యాయామంగా పరిగణించకూడదు.
ఏం తిన్నా క్యాలరీలను లెక్కించుకుంటూ ఉండాలి. పిండి పదార్థాలు తక్కువగా, ప్రొటీన్, మంచి కొవ్వులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ధ్యానంతో ఒత్తిడి తగ్గుతుంది. కానీ కళ్లు మూసుకుని ఆఫీసు విషయాల గురించి ఆలోచించేవాళ్లు ఉంటారు. అలా కాకుండా అనుభవజ్ఞులైన గురువుల సహాయంతో ఫలవంతమైన ధ్యానం సాధన చేయాలి.
-డాక్టర్ గోపిచంద్ మన్నం
చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్,
మేనేజింగ్ డైరెక్టర్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్.
Updated Date - 2023-01-03T11:53:47+05:30 IST