Heart surgeries: లక్షల్లో ఖరీదైన వైద్యం రూపాయి ఖర్చులేకుండా..!
ABN, First Publish Date - 2023-03-02T12:28:03+05:30
గాంధీ (Gandhi Hospital), ఉస్మానియా ఆస్పత్రుల్లో (Osmania Hospital) క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి రావడంతో రోగులకు ఊరట
‘గుండె’కు అండ..!
ఉస్మానియా, గాంధీలో క్యాథ్‌ల్యాబ్ సేవలు
ఉచితంగా శస్త్రచికిత్సలు
హైదరాబాద్ సిటీ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గాంధీ (Gandhi Hospital), ఉస్మానియా ఆస్పత్రుల్లో (Osmania Hospital) క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి రావడంతో రోగులకు ఊరట లభిస్తోంది. గుండె జబ్బులకు (Heart) సంబంధించిన అన్ని రకాల సేవలను ఇక్కడ అందిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల ఖరీదైన సేవలు ఇక్కడ ఉచితంగా లభిస్తున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో నెల రోజుల క్రితం ప్రారంభించిన క్యాథ్‌ల్యాబ్‌తో ఇప్పటికే 250 మందికి పైగా గుండె సంబంధిత రోగులకు చికిత్స అందించారు. పలువురికి యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్ చేశారు. గతంలో క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులో లేని సమయంలో పేద, మధ్యతరగతి వర్గాల వారు ఎక్కువగా నిమ్స్‌ను ఆశ్రయించే వారు. ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, ఇతర చికిత్సలు అందుబాటులోకి రావడంతో నిమ్స్‌కు వచ్చే రోగుల సంఖ్య తగ్గినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టిందా లేదా.. నిర్ధారించుకుని అవసరమైతే స్టంట్‌లు వేయడానికి క్యాథ్‌ల్యాబ్ సేవలు ఉపయోగడతాయి. గుండెకు సంబంధించిన 21 రకాల ప్రక్రియలను ఇందులో నిర్వహిస్తారు.
సేవలు ఉచితం
ప్రైవేట్ ఆస్పత్రుల్లో గుండెల్లో బ్లాక్స్ ఏర్పడితే స్టంట్లు వేసేందుకు దాదాపు రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు వ్యయం అవుతుంది. అంత పెద్ద మొత్తం ఖర్చు భరించడం పేద, మధ్య తరగతి వర్గాలకు భారమే. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో గుండె సంబంధిత పరీక్షలు, యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్, స్టంట్లు ఉచితం.
ఉపయోగాలు ఇవీ
గుండె సంబంధిత బాధితులకు క్యాథ్‌ల్యాబ్ సేవలు ముఖ్యమైనవి. ఎవరికైనా రక్తనాళాలు చిట్లినా, గుండెకు రంధ్రాలు ఏర్పడినా, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ సేవలను క్యాథ్‌ల్యాబ్‌లో అందిస్తారు. గుండె వాల్వుల్లో లోపాలుంటే నిర్ధారించుకొని అవసరమైన వారికి సర్జరీలు చేసి మార్పిడి చే స్తారు. గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులుంటే రేడియో ఫ్రీక్వెన్సీ నిర్వహిస్తారు. బాధితులకు ముందుగా ఈసీజీ, 2డీ ఈకో పరీక్షలు నిర్వహించి గుండె రక్తనాళాల్లో ఇబ్బందులు ఉన్నాయోమో గుర్తిస్తారు. రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నట్లు అనుమానం కలిగితే యాంజియోగ్రామ్ చేస్తారు. తర్వాత బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారణ అయితే యాంజియోప్లాస్టీ చేసి స్టంట్లు వేస్తారు.
Updated Date - 2023-03-02T12:28:03+05:30 IST