Chopper Crash: హెలికాప్టర్ కుప్పకూలి ఉక్రెయిన్ హోం మంత్రి సహా 16 మంది దుర్మరణం
ABN, First Publish Date - 2023-01-18T14:43:53+05:30
ఉక్రెయిన్‌లో బుధవారంనాడు ఘోర ప్రమాదం జరిగింది. కీవ్ నగరానికి వెలుపల ఉన్న బ్రోవరీ టౌన్‌లోని కిండర్‌గార్డెన్ సమీపంలో..
కీవ్: ఉక్రెయిన్‌లో బుధవారంనాడు ఘోర ప్రమాదం జరిగింది. కీవ్ (Kyiv) నగరానికి వెలుపల ఉన్న బ్రోవరీ టౌన్‌లోని కిండర్‌గార్డెన్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి (Chopper Crash) ఆ దేశ హోం మంత్రి సహా 16 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఇద్దరు పిల్లలు ఉన్నాయి. మరో 10 మంది పిల్లలు సహా 22 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేషనల్ పోలీస్ అధిపతి ఐగర్ క్లైమెంకో (Igor Klymenko) ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జనావాసాల మధ్య హెలికాప్టర్ కుప్పకూలిందని, ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి డెనిస్ మోనాస్‌టిస్కీ (Denys monastyrsky) సహా ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ ప్రమాదంలో మరణించారని ఆయన తెలిపారు.
హెలికాప్టర్ కుప్పకూలిన వెంటనే మంటలు ఒక్కసారిగా ఎగిసి పడి, భవంతులకు నిప్పంటుకున్నట్టు సోషల్ మీడియోలో వచ్చిన వీడియోల్లో తెలుస్తోంది. సంఘటనా ప్రాంతం బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో నిండిపోయింది. ఈశాన్య కీవ్‌కు 20 కిలోమీటర్ల దూరంలో బ్రోవరీ టౌన్ ఉంది. బ్రోవరీ పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ఇటీవల రష్యా బలగాలు ప్రయత్నించగా, ఉక్రెయిన్ బలగాలు గట్టిగా ప్రతిఘటించాయి.
Updated Date - 2023-01-18T15:03:40+05:30 IST