Covid-19: మమ్మల్నే టార్గెట్ చేస్తున్నారు.. దీటుగా బదులివ్వగలం.. చైనా వార్నింగ్
ABN , First Publish Date - 2023-01-03T17:22:42+05:30 IST
చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు పలు దేశాలు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజింగ్: చైనా(China) నుంచి వచ్చే ప్రయాణికులకు పలు దేశాలు కొవిడ్ నెగెటివ్ రిపోర్టు(Mandatory Covid Test) తప్పనిసరి చేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం చైనా ప్రయాణికులనే టార్గెట్ చేస్తూ ఆంక్షలు(Restrictions) విధిస్తున్నారంటూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మంగళవారం ఓ పత్రికాసమావేశంలో ఫైర్ అయ్యారు. చైనా కూడా తగు చర్యలు తీసుకోగలదంటూ ఆయా దేశాలను హెచ్చరించారు(Warning). అమెరికా(USA), కెనడా(Canada), జపాన్(Japan) సహా దాదాపు డజను దేశాలు చైనా ప్రయాణికులకు కొవిడ్ రిపోర్టులు తప్పనిసరి చేశాయి. కరోనా లేదన్నట్టు రిపోర్టు చూపిస్తేనే దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేశాయి. ఈ చర్యలు సమంజసం కాదని, వీటికి శాస్త్రపరమైన ప్రాతిపదిక ఏదీ లేదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తేల్చి చెప్పారు.
చైనాలో రెండేళ్లుగా అమలవుతున్న కఠిన కరోనా ఆంక్షలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో ప్రభుత్వం గతేడాది ఒక్కసారిగా పలు సడలింపులు ఇచ్చింది. దీంతో.. డ్రాగన్ దేశంలో కరోనా వ్యాప్తి(Covid Outbreak) పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే మరో సంక్షోభం తప్పదన్న భయాల నడుమ అనేక దేశాలు ఒకప్పటి కొవిడ్ ఆంక్షలను పునరుద్ధరించాయి. ముఖ్యంగా చైనా నుంచి తమ దేశాలకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించాలన్న నిబంధన విధించాయి. చైనాలో కరోనా కేసుల వెల్లడి, వ్యాధి తీవ్రత తదితర అంశాల్లో ప్రభుత్వం పారదర్శకత పాటించకపోవడంతోనే తాము ఆంక్షలకు సిద్ధపడ్డామని పలు దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.