Michelle Fairburn: బెడిసికొట్టిన టిక్‌టాకర్ ఛాలెంజ్.. నీళ్లు తాగిన పాపానికి, ఆసుపత్రి పాలైంది
ABN , First Publish Date - 2023-07-31T19:43:09+05:30 IST
నీరు.. మానవ మనుగడకు ఎంతో ప్రధానమైన వనరు ఇది. మనం జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా.. నీరు తప్పకుండా తాగాల్సిందే. అలాగని మోతాదుకి మించి అతిగా తాగితే మాత్రం.. అనారోగ్య బారిన పడటం ఖాయం. ఇందుకు తాజాగా...
నీరు.. మానవ మనుగడకు ఎంతో ప్రధానమైన వనరు ఇది. మనం జీవించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా.. నీరు తప్పకుండా తాగాల్సిందే. అలాగని మోతాదుకి మించి అతిగా తాగితే మాత్రం.. అనారోగ్య బారిన పడటం ఖాయం. ఇందుకు తాజాగా వెలుగు చూసిన ఉదంతాన్నే మనం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ ఛాలెంజ్‌లో భాగంగా.. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రోజుకి నాలుగు లీటర్ల నీళ్లు తాగింది. ఇలా 12 రోజుల పాటు నాలుగు లీటర్ల నీళ్లు తాగడంతో.. ఆమె ఆరోగ్యంపై అది ప్రభావం చూపించింది. దీంతో.. ఆమె ఆసుపత్రిపాలవ్వాల్సి వచ్చింది. అసలేమైందంటే..
ఆండీ ఫ్రిసెల్లా అనే ఒక యూట్యూబర్ ‘75 హార్డ్’ అనే పేరుతో ఓ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు.. 75 రోజుల పాటు నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. చీట్ మీల్స్ లేని స్ట్రక్చర్డ్ డైట్‌ని తప్పకుండా పాటించాలి. 45 నిమిషాలు చొప్పున రోజుకు రెండుసార్లు వర్కవుట్ చేయాలి. రోజుకి 10 పేజీలు చదువుతూ.. తాము చేస్తున్న ఈ మొత్తం కార్యకలాపాలకు సంబంధించి ఫోటోలు తీసుకుని పెట్టుకోవాలి. ఇది ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఛాలెంజ్ కావడంతో.. చాలామంది యువతీ, యువకులు ఇందులో పాల్గొనడం మొదలుపెట్టారు. తానూ ఏం తక్కువ కాదంటూ.. కెనడాకు చెందిన ఫేమస్ టిక్‌టాకర్ మిచెల్ ఫెయిర్‌బర్న్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంది.
మొదటి 11 రోజుల వరకు అంతా సజావుగానే సాగింది. ఈ ఛాలెంజ్‌లో పాటించాల్సిన రూల్స్ అన్నింటికీ తూ.చ. తప్పకుండా పాటించింది. కానీ.. 12వ రోజుకి వచ్చేసరికి మాత్రం తేడా కొట్టేసింది. 12వ రోజు రాత్రి పడుకోవడానికి ముందు ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. వీరేచనాలు, తీవ్ర కడుపు నొప్పితో బాధపడింది. రాత్రి నుంచి పొద్దున తెల్లారేదాకా.. ఆమె బాత్రూంలోనే సమయం గడిపింది. ఉదయంకల్లా ఆమె పూర్తిగా బలహీనంగా మారింది. ఉదయాన్నే వైద్యుడి వద్దకు వెళ్లి చెకప్ చేయించుకుంది. ఆమెని పరిశీలించిన డాక్టర్.. సోడియం లోపం తీవ్రంగా ఉందని, మోతాదుకి మించి నీళ్లు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాడు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే.. రోజుకి అరలీటర్ కంటే తక్కువ నీళ్లు తాగాలని సూచించాడు.
ఈ విధంగా వైద్యుడు ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా.. మిచెల్ మాత్రం తన ఛాలెంజ్‌ని విరమించుకోలేదు. తాను కంటిన్యూ చేస్తానని కుండబద్దలు కొట్టింది. డాక్టర్ చెప్పినట్టు నీళ్లు తక్కువగా తాగుతానని, ఛాలెంజ్‌లోని మిగతా రూల్స్‌ని ఫాలో అవుతానని పేర్కొంది. తాను ప్రతిరోజూ వైద్యుల వద్ద వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి.. సోడియం లోపం సమస్య త్వరగా తీరిపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది.