Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ అయ్యిందిగా.. మా డబ్బులు మాకు తిరిగిచ్చేయండి.. న్యూస్ యాంకర్‌పై నెటిజన్లు ఫైర్
ABN , First Publish Date - 2023-08-24T16:54:37+05:30 IST
చంద్రయాన్-3 మిషన్‌తో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాలకు సాధ్యం కానిది.. భారత్ చేసి చూపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి..
చంద్రయాన్-3 మిషన్‌తో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్ర దేశాలకు సాధ్యం కానిది.. భారత్ చేసి చూపించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి.. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటలకెక్కింది. దీంతో.. ప్రపంచంలోని నలుమూలల ప్రాంతాల నుంచి భారత్‌కు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఇలా అభినందించిన వ్యక్తుల్లో యూకే న్యూస్ ప్రెజెంటర్ పాట్రిక్ క్రిస్టిస్ కూడా ఉన్నాడు. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయినందుకు అతడు లైవ్‌లో భారత్‌కు అభినందనలు తెలిపాడు. కానీ.. ఆ తర్వాత అతడు చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలామందికి కోపం తెప్పించింది. దీంతో.. అతడ్ని ‘రేసిస్ట్’ (జాత్యహంకారి) అంటూ నెట్టింట్లో ట్రోల్స్ చేస్తున్నారు.
ఇంతకీ పాట్రిక్ క్రిస్టిస్ ఏమన్నాడంటే.. దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టినందుకు నేను భారత్‌కి అభినందనలు తెలుపుతున్నాను. ఇదే సమయంలో 2016 నుంచి 2021 వరకు సహాయార్థం యూకే నుంచి తీసుకున్న 2.3 బిలియన్ పౌండ్లను కూడా తిరిగి ఇవ్వాలని కోరుతున్నాను. వచ్చే ఏడాదిలోనూ 57 మిలియన్ పౌండ్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే.. బ్రిటీష్ ట్యాక్స్‌పేయర్ దాన్ని ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను. మా నియమం ప్రకారం.. స్పేస్ ప్రోగ్రామ్ కలిగిన దేశాలకు డబ్బులు ఇవ్వకూడదు’’ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. భారతదేశాన్ని ‘పేదదేశం’గా పేర్కొన్నాడు. ఇకపై భారత్‌కు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం లేదని యూకే ప్రభుత్వాన్ని సూచించాడు కూడా! చంద్రుడి దక్షిణ ధ్రువంపై రాకెట్‌ను పంపించేంత ఆర్థిక స్థోమత ఉన్నప్పుడు.. ఆర్థిక సహాయార్థం భారత్ యూకేకి రాకూడదని అన్నాడు.
భారతదేశంలో మొత్తం 229 మిలియన్ మంది ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని పాట్రిక్ క్రిస్టిస్ తన బులెటిన్‌లో భాగంగా చెప్పాడు. యూఎన్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రపంచంలో ఇంతమంది పేదరికంలో ఉండటం ఇదే అత్యధికమని తెలిపాడు. అయితే.. భారత్ 3.75 ట్రిలియన్ డాలర్ల వార్షిక GDPతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నాడు. భారత ప్రభుత్వమే పేదరికంలో ఉన్నవారిని పట్టించుకోనప్పుడు.. యూకే ఎందుకు సహాయం చేయాలని అన్నాడు. ఈ విధంగా ఆ న్యూస్ ప్రెజెంట్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవ్వగా.. నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘‘మీరు భారత్ నుంచి 45 ట్రిలియన్ డాలర్లకు పైగా దొంగలించారు, దేశాన్ని ఛిన్నాభిన్నం చేశారు. మరి దాని సంగతేంటి’’ అని అతడ్ని నిలదీస్తారు. ఓ జాత్యహంకారి.. ఎందుకు అసూయతో ఏడుస్తున్నావంటూ విమర్శిస్తున్నారు.