Student Suicide: విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తతకు దారి తీసిన నిరసనలు.. క్యాంపస్‌లో అసలు ఏం జరిగిందంటే..?
ABN, First Publish Date - 2023-09-16T12:23:10+05:30
అస్సాంలోని కాచార్ జిల్లా సిల్చార్‌లో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(ఎన్‌ఐటీ) ఓ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా మిగతా విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
సిల్చార్: అస్సాంలోని కాచార్ జిల్లా సిల్చార్‌లో గల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(ఎన్‌ఐటీ) ఓ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా మిగతా విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బల ప్రయోగాన్ని చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ నేడు కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టే అవకాశాలున్నాయి. నివేదికల ప్రకారం.. అస్సాంలోని ఎన్‌ఐటీ సిల్చార్‌లో ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ మూడో సెమిస్టర్ చదువుతున్న అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ఆత్మహ్మత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాల విషయానికొస్తే ఆ విద్యార్థికి బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. దీంతో వాటిని క్లియర్ చేసేందుకు మళ్లీ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తర్వాతి సెమిస్టర్‌కు రిజిస్టర్ చేసుకోవడం కోసం అతడు చేసిన అభ్యర్థనను కళాశాల అధికారులు తిరస్కరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సదరు విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇతర విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలు చేపట్టారు.
ఈ క్రమంలోనే విద్యార్థులు రిజిస్ట్రార్ అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో విద్యార్థులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తేవడానికి స్వల్పంగా బలప్రయోగం చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. మరణించిన విద్యార్థిది అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఈ రోజు మరింత మంది విద్యార్థుల ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో కఛాడ్ జిల్లా పోలీసులు, ఎన్‌ఐటీ యంత్రాంగం మధ్య అత్యవసరం సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో పరిస్థితులు సద్దుమణిగే వరకు కళాశాలను మూసివేయాలని నిర్ణయించారని సమాచారం. అయితే కళాశాల అడ్మినిస్ట్రేషన్ ప్రవేశపెట్టిన కొన్ని కొత్త మార్గదర్శకాలపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
"నిన్న మేము ఎన్‌ఐటీ సిల్చార్ డైరెక్టర్ కోసం రాత్రంతా వేచి ఉన్నాము. కానీ ఆయన మమ్మల్ని కలవలేదు. అంతేకాకుండా మా అభ్యర్థనలన్నింటినీ తిరస్కరించారు. ప్రతి రోజు, విద్యాసంస్థ విద్యార్థుల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెడుతోంది. విద్యార్థులు డైరెక్టర్ ప్రవర్తనతో సంతోషంగా లేరు. ఈ రోజు, ఒక విద్యార్థి డిప్రెషన్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ”అని నిరసన తెలుపుతున్న విద్యార్థి ఒకరు తెలిపారు. నిజానికి తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ను కలవాలనుకున్నామని, అయితే పోలీసులు తమపై లాఠీచార్జి చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. "మా సీనియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మేము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాము. కానీ ఎన్‌ఐటీ సిల్చార్ అధికారులు వచ్చి మాతో మాట్లాడలేదు. వారు మాపై పోలీసులతో దాడి చేయించారు. పోలీసులు మాపై లాఠీఛార్జ్ చేశారు" అని మరొక విద్యార్థి తెలిపారు. మరోవైపు విద్యార్థి మృతిని ఎన్‌ఐటీ యంత్రాంగం ధృవీకరించింది. మొదటి సంవత్సరం నుంచి ఆ విద్యార్ధికి చదువు విషయంలో సమస్యలు ఉన్నాయని, బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయలేక నిరాశకు గురై ఉంటాడని పేర్కొంది. అతడి మానసిక స్థితిని తోటి విద్యార్థులు గుర్తించి ముందుగానే కళాశాల యంత్రాంగం దృష్టికి తీసుకురావాల్సిందని వ్యాఖ్యానించింది. అయితే విద్యార్థులు ఆందోళనల్లో కార్లను ధ్వంసం చేశారని, డీన్ నివాసాన్ని ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-09-16T12:24:13+05:30 IST