Covid-19: ఒకేరోజులో 1000 దాటిన కరోనా కొత్త కేసులు
ABN, First Publish Date - 2023-03-19T15:29:16+05:30
ఒకవైపు హెచ్3ఎన్2 కేసులు వెలుగుచూస్తున్న క్రమంలో ఆదివారంనాడు రికార్డు స్థాయిలో 1,000కి పైగా..
న్యూఢిల్లీ: ఒకవైపు హెచ్3ఎన్2 (H3N2) కేసులు దేశంలో వెలుగుచూస్తున్న క్రమంలో ఆదివారంనాడు రికార్డు స్థాయిలో 1,000కి పైగా కరోనా (Covid-19) కొత్త కేసులు నమోదయ్యాయి. 129 రోజుల తర్వాత దేశంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డాటా ప్రకారం ఆదివారం ఉదయం 8 గంటల వరకూ గత 24 గంటల్లో కొత్తగా 1,071 కొత్త కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ దేశంలో కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 5,30,802కు పెరిగింది.
డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
కాగా, నేటీకి కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా ఆందోళన కలిగించేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల పేర్కొంది. ఆరోగ్యం, ఆరోగ్య వ్యవస్థలకు గణనీయమైన నష్టాన్ని కలిగించే సంభావ్యతతో కోవిడ్ ఇప్పటికీ ప్రమాదకరమైన అంటు వ్యాధిగా మిగిలి ఉందని డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది. కోవిడ్ మహమ్మారి ఇప్పటికీ అంతర్జాతీయ ఎమర్జెన్సీగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డెరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ (Tedros Adhanom) చెప్పారు.
Updated Date - 2023-03-19T15:34:06+05:30 IST