BJP state president: అధికార పార్టీ నేతల ఆస్తుల చిట్టా ఇదిగో..!
ABN , First Publish Date - 2023-04-15T08:05:20+05:30 IST
తన చేతి గడియారం విలువపై రాద్ధాంతం చేసిన డీఎంకే నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
- కొందరు ఎంపీలు, మంత్రుల ఆస్తుల వివరాలు వెల్లడించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
- త్వరలో మరో 3 జాబితాలు విడుదల చేస్తానంటూ ప్రకటన
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తన చేతి గడియారం విలువపై రాద్ధాంతం చేసిన డీఎంకే నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) గతంలో ప్రకటించినట్లు డీఎంకే ప్రముఖుల ఆస్తుల వివరాలను శుక్రవారం ఉదయం వెల్లడించారు స్థానిక టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం కమలాలయంలో శుక్రవారం ఉదయం ఆయన డీఎంకే ఎంపీలు, కొందరు మంత్రులకు సంబంధించి ఆస్తులు, అక్రమార్జనల వివరాలను విడుదల చేశారు. ప్రస్తుతం తాను తొలిజాబితాను విడుదల చేశానని త్వరలో మరో మూడు జాబితాలలో డీఎంకే నాయకులు అక్రమాస్తుల వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రాన్ని పరిపాలించిన ఇతర పార్టీల ప్రముఖుల అక్రమాస్తుల వివరాలను కూడా తాను బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. అవినీతికి వ్యతిరేకంగా తాను త్వరలో రాష్ట్ర మంతటా ‘నా నేల... నా ప్రజలు’ పేరుతో పర్యటనను చేపట్టనున్నానని ఆయన తెలిపారు.
చేతి గడియారం వివరాలివిగో...
మీడియా సమావేశంలో అన్నామలై తాను ధరిస్తున్న రఫేల్ చేతి గడియారానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. తన స్నేహితుడు రామకృష్ణన్(Ramakrishnan) ద్వారా ఆ గడియారాన్ని రూ.3లక్షలు చెల్లించి కొనుగోలు చేసినట్లు చెప్పారు. 2021లో ఆ గడియారాన్ని కొనుగోలు చేశానంటూ రశీదును కూడా చూపెట్టారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పదవిని చేపట్టినప్పటి నుంచి రూ.8లక్షలు ఖర్చు చేస్తున్నానని చెప్పారు. తన ఇంటి బాడుగను, అక్కడి సిబ్బంది జీతాలను తన స్నేహితులు చెల్లిస్తున్నారని, తాను ఉపయోగిస్తున్న కారుకు పార్టీయే రోజూ పెట్రోలు పోస్తోందని తెలిపారు.
డీఎంకే నేతల ఆస్తుల విలువ రూ.1.31 లక్షల కోట్లు...
అన్నామలై తన ట్విట్టర్ పేజీలో డీఎంకే ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) కుటుంబీకుల ఆస్తుల వివరాలను వీడియో రూపంలో వెలువరించారు. ఎంపీలు, మంత్రులు సహా 12 మంది డీఎంకే ప్రముఖుల ఆస్తులు రూ.1.31లక్షల కోట్లని ఆయన పేర్కొన్నారు.
సీఎం స్టాలిన్ - రూ.200 కోట్లు
ఎంపీ జగద్రక్షగన్ - రూ.50,219.37 కోట్లు
ఎంపీ కనిమొళి - రూ.830.33 కోట్లు
ఎంపీ టీఆర్ బాలు -రూ.10,840 కోట్లు
ఎంపీ కదిర్ ఆనంద్ - రూ.579.18 కోట్లు
ఎంపీ కళానిధివీరాసామి - 2923 కోట్లు
మంత్రి ఏవీ వేలు - రూ.5442.39 కోట్లు
మంత్రి కేఎన్ నెహ్రూ - రూ.2495.14 కోట్లు
మంత్రి పొన్ముడి - రూ.581 కోట్లు
మంత్రి అన్బిల్ మహేష్ - రూ.1000కోట్లు
మంత్రి ఉదయనిధి - రూ.2000కోట్లు
సన్ టీవీ అధినేత కళానిధి మారన్ - రూ.12,450కోట్లు
సీఎం స్టాలిన్ అల్లుడు శబరీశన్ - రూ.902కోట్లు