BJP State President: నేడు మంత్రుల అవినీతి చిట్టా విప్పుతా!
ABN, First Publish Date - 2023-04-14T08:16:02+05:30
మంత్రులు, నాయకుల అవినీతి అక్రమాలు, అక్రమార్జనలకు సంబంధించిన వివరాలను శుక్రవారం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే మంత్రులు, నాయకుల అవినీతి అక్రమాలు, అక్రమార్జనలకు సంబంధించిన వివరాలను శుక్రవారం తమిళ సంవత్సరాది సందర్భంగా వెల్లడించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు. ఈ మేరకు గురువారం తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు ట్విట్టర్, ఇంటర్నెట్ ద్వారా డీఎంకే నేతల అవినీతి చిట్టా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. నెల రోజులకు ముందు తెన్కాశిలో పార్టీ సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ డీఎంకే మంత్రులు, నాయకులు అక్రమార్జనల వివరాలను బహిర్గతం చేస్తామంటూ హెచ్చరించారు. ఆ మేరకు డీఎంకే నేతల అవినీతి అక్రమాలను వెల్లడించేందుకు తమిళ సంవత్సరాది రోజును ఆయన ఎంచుకున్నారు. గురువారం తన ట్విట్టర్ పేజీలో ఓ ప్రకటన చేస్తూ డీఎంకే మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రస్తుత మంత్రులు, పార్టీ నిర్వాహకులు సహా 27 మందికి సబంధించిన అవినీతి అక్రమాలను, అక్రమార్జనలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. వీరంతా రూ.2.23 లక్షల కోట్ల మేరకు అక్రమాస్తులు సంపాదించారని అన్నామలై ఆరోపించారు. ఇక ట్విట్టర్ పేజీలో ఆయన వెలువరించిన వీడియోలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi), ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన సోదరుడు ఎంకే అళగిరి, కుమారుడు ఉదయనిధి, భార్య దుర్గా స్టాలిన్, అళగిరి కుమారుడు దురై తదితర ఫొటోలు కూడా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు అవినీతి చిట్టా విడుదలవుతుందని, ఆ సమయమే తమిళులందరికీ నిజమైన తమిళ ఉగాది అని అన్నామలై పేర్కొన్నారు.
Updated Date - 2023-04-14T08:16:02+05:30 IST