Delhi Excise policy case: ఎమ్మెల్సీ కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్
ABN , First Publish Date - 2023-03-06T16:35:17+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిఏ బుచ్చిబాబుకు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi Excise policy case)లో సిఏ బుచ్చిబాబుకు (CA Butchi Babu Gorantla) రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు (Rouse Avenue Court) బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. అదే సమయంలో పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ (Central Bureau of Investigation) ఫిబ్రవరి 8న బుచ్చిబాబును అరెస్టు చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వద్ద గోరంట్ల బుచ్చిబాబు కొంతకాలం ఆడిటర్‌గా పని చేశారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటివరకూ అభిషేక్ బోయిన పల్లి, విజయ్ నాయర్, బుచ్చిబాబుకు బెయిల్ లభించినట్లైంది.
మరోవైపు ఇదే మద్యం కుంభకోణం కేసు(Delhi Excise policy case)లో వ్యాపారవేత్త అమన్ దీప్ సింగ్‌ను అరెస్ట్ చేసిన ఈడీ(ED) అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు (Rouse Avenue Court)లో ప్రవేశ పెట్టారు. అమన్ దీప్‌ను 5 రోజుల ఈడీ కస్టడీకి సీబీఐ స్పెషల్ కోర్ట్ అప్పగించింది. అమన్ దీప్ సింగ్‌కు సౌత్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు ఆరోపించారు.
అటు ఈ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ లభించింది. కుల్దీప్‌సింగ్, నరేంద్రసింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్, సమీర్ మహేంద్రులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ నమోదు చేసిన కేసు తొలి చార్జ్ షీట్‌లో ఏడుగురి నిందితులపై అభియోగాలు మోపింది. తొలి చార్జ్ షీట్‌లో సమీర్ మహేంద్రు, అభిషేక్ ,విజయ్ నాయర్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఈడి కేసులో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి తీహార్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఈడీ నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే సిబిఐ నమోదు చేసిన కేసులో విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి బెయిల్ పొందారు. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్‌లను అరెస్టు చేయకుండానే సీబీఐ ప్రత్యేక కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. అరుణ్ పిళ్ళైని ఈడీ ఇటీవలే ప్రశ్నించింది.
ఇదే కేసులో ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia)కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ (Judicial Custody) విధించింది. మార్చి 20 వరకూ ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే సిసోడియా బెయిల్ అభ్యర్థనపై మార్చి 10న విచారణ ఉంటుందని కోర్టు తెలిపింది.
దీనికి ముందు, గత శనివారంనాడు సిసోడియా కస్టడీని మార్చి 6వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. ఆ గడువు ముగుస్తుండంటంతో సోమవారంనాడు ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది తన వాదన వినిపిస్తూ, తదుపరి రిమాండ్‌ను తాము కోరడం లేదని, రాబోయే 15 రోజుల్లో రిమాండ్ కోరవచ్చని తెలిపారు.