CM, BJP leader: బీజేపీ రాష్ట్ర నేతపై సీఎం పరువు నష్టం దావా
ABN, First Publish Date - 2023-05-11T07:46:37+05:30
గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో షెల్ సంస్థల నుంచి రూ.200 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో షెల్ సంస్థల నుంచి రూ.200 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) చేసిన ఆరోపణలను ఖండిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) బుధవారం ఉదయం పరువునష్టం దావా దాఖలు చేశారు. చెన్నై డిస్ర్టిక్స్ సెషన్స్ కోర్టులో ఈ మేరకు అన్నామలైపై ముఖ్యమంత్రి తరఫున సిటీ చీఫ్ క్రిమినల్ ప్రాసిక్యూటర్ జి.దేవరాజన్ క్రిమినల్ కేసును దాఖలు చేశారు. తమిళ ఉగాది సందర్భంగా గత ఏప్రిల్ 14న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో రాష్ట్రమంత్రుల అక్రమాస్తుల వివరాలంటూ ఓ జాబితాను విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్టాలిన్ దుబాయ్ పర్యటనకు వెళ్ళి అక్కడి ప్రైవేటు కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ కంపెనీలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, అన్బిల్ మహేష్ పొయ్యామొళి భాగస్వామ్యులుగా ఉండటం వల్లే ఆ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా 2011 శాసనసభ ఎన్నికల్లో సింగపూరుకు చెందిన షెల్ కంపెనీల నుంచి డీఎంకే(DMK) రూ.200 కోట్ల మేరకు ముడుపులు స్వీకరించిందని కూడా పేర్కొన్నారు.
ఈ అవకతవకలపై సీబీఐ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా సుపరిపాలనను అందించి ప్రజానీకం నుంచి ప్రశంసలందుకుంటున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరువు ప్రతిష్ఠలను దిగజార్చే రీతిలో అన్నామలై అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ సిటీ చీఫ్ క్రిమినల్ ప్రాసిక్యూటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో బీజేపీ నేత దురుద్దేశంతో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేశారని, వాటికి సంబందించి అన్నామలై(Annamalai) మీడియా సమావేశం వివరాలు పత్రికలలో ప్రచురితమయ్యాయని, అదే సమయంలో ఆయన ఓ వీడియోను కూడా వెలువరించారని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి కీర్తి ప్రతిష్ఠలకు కళంకం కల్గించేలా అన్నామలై చేసిన ఆరోపణలు శిక్షార్హమైనవేనని పేర్కొన్నారు. అన్నామలైపై ఐపీసీ 499, 500 సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను మేజిస్ర్టేట్ ఉమామహేశ్వరి విచారణకు స్వీకరించి, విచారణను రెండు నెలలకు వాయిదా వేశారు.
Updated Date - 2023-05-11T07:46:37+05:30 IST