Congress Vs BJP : మణిపూర్ తగులబడుతోంది.. బీజేపీ/ఆరెస్సెస్ రాజకీయాలే కారణం.. : జైరామ్ రమేశ్
ABN, First Publish Date - 2023-06-13T13:01:45+05:30
మణిపూర్‌లో గత నెల నుంచి ఘర్షణలు జరుగుతుండటానికి కారణం బీజేపీ/ఆరెస్సెస్ రాజకీయాలేనని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో గత నెల నుంచి ఘర్షణలు జరుగుతుండటానికి కారణం బీజేపీ/ఆరెస్సెస్ రాజకీయాలేనని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఓ వార్తా కథనాన్ని ప్రస్తావిస్తూ, తాను చాలా కాలం నుంచి చెప్తున్నది ఇప్పుడు సుస్పష్టంగా రుజువైపోయిందన్నారు. 2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లోనూ, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తాము కృషి చేశామని కుకి మిలిటెంట్ సంస్థ అధ్యక్షుడు చెప్పినట్లు ఈ వార్తా కథనం పేర్కొంది. బీజేపీ నేతలు రామ్ మాధవ్, హిమంత బిశ్వ శర్మలతో కుదిరిన ఒప్పందం మేరకు తాము బీజేపీకి సహకరించామని చెప్పినట్లు వెల్లడించింది.
మణిపూర్‌లో మెయిటీలు, కుకీల మధ్య ఘర్షణలు మే నెలలో ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణలకు కారణం కుకీ తిరుగుబాటు సంస్థలేనని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ (SoO)పై సంతకాలు చేసిన సంస్థలే ఈ ఘర్షణలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తోంది.
అయితే ఎస్ఓఓపై సంతకాలు చేసిన కుకీ సంస్థల్లో ఒకటైన యునైటెడ్ కుకీ లిబరేషన్ ఫ్రంట్ చైర్మన్ ఎస్ఎస్ హవోకిప్‌పై 2018లో అక్రమాయుధాల కేసు నమోదైంది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే యమ్‌తోంగ్ హవోకిప్ నుంచి అక్రమంగా ఆయుధాలను కొన్నారని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన తన అఫిడవిట్‌ను ఈ నెల 8న ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌తోపాటు 2019లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తాను రాసిన లేఖను జత చేశారు. ఈ లేఖలో, 2017లో జరిగిన మణిపూర్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తాము సహకరించామని, బీజేపీ నేతలు హిమంత బిశ్వ శర్మ, రామ్ మాధవ్ తమ సహకారం కోరారని తెలిపారు. ఈ రాష్ట్రంలో బీజేపీ 2017లో మొట్టమొదటిసారి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే.
మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటవడం కోసం తాను చాలా ముఖ్యమైన పాత్రను పోషించానని ఈ లేఖలో ఎస్ఎస్ హవోకిప్ తెలిపారు. తమ మద్దతు లేకపోతే ఈ ప్రభుత్వం ఏర్పాటై ఉండేది కాదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి 80-90 శాతం ఓట్లు వచ్చే విధంగా కృషి చేసినట్లు తెలిపారు. తాను పిస్తోళ్లను తిరిగి ఇచ్చేసినప్పటికీ అక్రమాయుధాల కేసులో తనను తప్పుగా ఇరికించారని, తనకు ఉపశమనం కలిగించాలని ఈ లేఖలో అమిత్ షాను కోరారు. తాను గతంలో బీజేపీకి చేసిన ఉపకారాల గురించి ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి :
AIADMK Vs BJP : బీజేపీతో తెగదెంపులకు ఏఐఏడీఎంకే సిద్ధం?
Govt Vs Twitter : ట్విటర్ మాజీ సీఈఓ ఆరోపణలు పూర్తిగా అబద్ధం : కేంద్ర మంత్రి
Updated Date - 2023-06-13T13:02:46+05:30 IST