Rahul Gandhi : ఆరెస్సెస్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
ABN, First Publish Date - 2023-04-15T18:56:06+05:30
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భివాండి మేజిస్ట్రేట్ కోర్టు గొప్ప ఊరట ఇచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత రాజేశ్ కుంటే
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి భివాండి మేజిస్ట్రేట్ కోర్టు గొప్ప ఊరట ఇచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేత రాజేశ్ కుంటే (Rashtriya Swayamsevak Sangh leader Rajesh Kunte) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి శాశ్వత మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకాకుండానే విచారణ జరుగుతుంది. అయితే అవసరమైనపుడు హాజరుకావాలని ఆయనను కోర్టు కోరవచ్చు.
రాహుల్ గాంధీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలోని థానే జిల్లా, భివాండిలో మాట్లాడుతూ, మహాత్మా గాంధీ మరణానికి కారణం ఆరెస్సెస్సేనని చెప్పారు. దీంతో రాజేశ్ కుంటే 2014లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ 2018 జూన్ నెలలో మేజిస్ట్రేట్ సమక్షంలో హాజరయ్యారు. తాను నిరపరాధినని చెప్పారు. అనంతరం విచారణ ప్రారంభమైంది.
కోర్టుకు హాజరవడం నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ 2022లో దరఖాస్తు చేశారు. తాను పార్లమెంటు సభ్యుడినని, తన నియోజకవర్గానికి వెళ్లవలసి ఉంటుందని, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుందని చెప్పారు. ఆయనకు మినహాయింపు ఇవ్వవద్దని రాజేశ్ కుంటే కోర్టును కోరారు. రాహుల్ ఓ పరువు నష్టం కేసులో దోషి అని గుజరాత్‌లోని సూరత్ కోర్టు తీర్పు చెప్పిందని, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిందని, దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లారు.
రాహుల్ గాంధీ తరపు న్యాయవాది నారాయణ అయ్యర్ దీనిపై స్పందిస్తూ, తన క్లయింట్ సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేశారని చెప్పారు. తన క్లయింట్ దాఖలు చేసిన మినహాయింపు దరఖాస్తును ఈ కొత్త పరిణామాలు ప్రభావితం చేయబోవని తెలిపారు.
జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎల్‌సీ వాడికర్ ఇరు పక్షాల వాదోపవాదాలను విన్న తర్వాత రాహుల్ గాంధీ దాఖలు చేసిన వ్యక్తిగత హాజరు మినహాయింపు దరఖాస్తును అనుమతించారు. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి :
Delhi Excise Policy: కోర్టుల ముందు అబద్దాలు చెబుతున్న దర్యాప్తు సంస్థలు.. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్
Kejriwal Vs Rijiju : కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి రిజిజు సూటి ప్రశ్న
Updated Date - 2023-04-15T18:56:06+05:30 IST